మూడు రాష్త్రాలలో బిజెపి – కాంగ్రెస్ ముఖాముఖీ పోటీ

వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడటంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాలపైనే అందరి ఆసక్తి కేంద్రీకృతమైంది. ఈ ఐదు రాష్ట్రాలలో  తెలంగాణను మినహాయిస్తే మిగిలిన నాలిగింటిలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ముఖ్యమైనవి. ఈ మూడు రాష్ట్రాలల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ద్విముఖపోరు నెలకొన్నది. ప్రస్తుతం అక్కడ బిజెపి అధికారంలో ఉండగా, మిజోరాంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణలో టి ఆర్ ఎస్ అధికారంలో ఉంది.
ఐదు రాష్త్రాలలో కూడా అధికారంలోకి రావడం ద్వారా 2019 ఎన్నికలలో బలమైన శక్తిగా తయారు కావాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుండగా, ఐదింటిలో కాంగ్రెస్ ను అధికారంకు దూరం చేయడం ద్వారా లోక్ సభ ఎన్నికలలో తమకు పోటీయే లేని పరిస్థితి ఏర్పరచుకోవాలని బిజెపి ప్రయత్నం చేస్తున్నది. దానితో ఈ ఎన్నికలు కీలకంగా మారుతున్నాయి.

2013 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని 230 సీట్లకు 165 సీట్లు సాధించిన బీజేపీ కాంగ్రెస్‌ను కేవలం 58 సీట్లకే పరిమితం చేసి ఘన విజయం సాధించింది. రాజస్థాన్‌లోని 200 సీట్లకుగాను బీజేపీ 163 సీట్లు సాధించి కాంగ్రెస్(21) పై భారీ మెజార్టీతో ఘన విజయాన్ని నమోదుచేసింది. ఛత్తీస్‌గఢ్‌లో 90 సీట్లకుగాను బీజేపీ 49 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ 39 స్థానాలకే పరిమితమైంది. ఈ విధంగా మూడు రాష్ర్టాల్లోనూ ఘన విజయం సాధించిన బీజేపీ మరోమారు గెలుపొందాలని ప్రయత్నిస్తుండగా, ఎలాగైనా ఆ పార్టీని గద్దె దించాలని కాంగ్రెస్ శతవిధాలా వ్యూహాలను రచిస్తున్నది.

ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలలో  బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ కేంద్రీకృతమైంది.  వాస్తవానికి, బీజేపీని గద్దె దించటం కోసం ఈ రాష్ట్రాలలో బీఎస్పీ, ఎస్పీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. కాంగ్రెస్ తమతో పొత్తుకు సరైన ప్రయత్నాలు చేయలేదంటూ, తాము ఒంటరి పోరుకే వెళ్తామని బీఎస్పీ అధినాయకురాలు మాయావతి ఇటీవలే తేటతెల్లం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో మూడోపక్షంగా ఉన్న అజిత్‌జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్‌తో మాయా పొత్తు కుదుర్చుకున్నారు.

ఇదే విధంగా, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా కాంగ్రెస్ ఎంతకూ ముందుకు రావటం లేదని, తాము బీఎస్పీతో కలిసి ఈ రాష్ట్రాలలో పోటీ చేస్తామని తాజాగా ప్రకటించారు. దీంతో, ఈ రాష్ట్రాలలో  ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ నెలకొన్నప్పటికీ, ఎస్పీ, బీఎస్పీ తదితర పక్షాల ప్రభావం కూడా ఉంటుందా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

ఇక మిజోరాం విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2008 నుంచి అధికారంలో ఉన్నది. 2013లో మొత్తం 40 సీట్లకుగాను కాంగ్రెస్ 34 స్థానాలను సాధించి తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ మిజోరాం నేషనల్ ఫ్రంట్, మిజోరాం పీపుల్స్ కాన్ఫరెన్స్ వంటి ప్రాంతీయ పార్టీలతో తలపడనున్నది.