పంచాయతీరాజ్ బలంగా ఉంటేనే దేశం అభివృద్ధి 

పంచాయతీరాజ్ వ్యవస్థ బలంగా ఉంటేనే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.   పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న సర్పంచులతో ప్రధాని మోడీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీరాజ్‌శాఖ ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. 

పంచాయతీరాజ్ సందర్భంగా ప్రధాని ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్ ను ప్రారంభించారు. ప్రస్తుతం లక్షా 25 వేల పంచాయతీల్లో బ్రాండ్ బ్యాండ్ సేవలు అందుతున్నాయని ప్రధాని తెలిపారు. ఈ-గ్రామస్వారజ్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా ఎన్నో సేవలు పొందవచ్చని చెబుతూ  గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మరింత మెరుగు పరుచుకోవాలని సూచించారు. 

ప‌్ర‌తి ఒక్క‌రూ ఆత్మ‌స్థైర్యంతో ఉండ‌గ‌లిగేలా క‌రోనా గొప్ప గుణ‌పాఠం నేర్పింద‌ని ప్ర‌ధాని ఈ సందర్భంగా  తెలిపారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణకు కృషిచేస్తున్న సర్పంచులంద‌రికీ ప్ర‌ధాని ధన్యవాదాలు తెలిపారు. 

మెరుగైన సేవలతో పురస్కారాలు పొందిన సర్పంచులను అభినందించారు. ఏటా మెరుగైన పనితీరు కనబర్చిన గ్రామపంచాయతీలకు పురస్కారాలు అందిస్తామని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్రకటించారు. 

కరోనా సంక్షోభ సమయంలో పేదలకు సరిపడా ఆహారధాన్యాలు అందుబాటులో ఉంచాల‌ని సర్పంచుల‌కు సూచించారు. విద్యుత్‌, రహదారులు, పారిశుద్ధ్యం మెరుగు కోసం చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రజలంతా ఇండ్లలోనే  ఉండి కరోనా మ‌హ‌మ్మారిని తరిమికొట్టాలని ప్ర‌ధాని పిలుపునిచ్చారు. కరోనాపై గ్రామ ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం క‌ల్పించాల‌ని స‌ర్పంచుకుల‌కు సూచించారు.