ఏపీలో కరోనా ఉధృతిపై కేంద్రం ఆందోళన

ఒకటి, రెండు జిల్లాలో మినిహా రాష్ట్రంలో కరోనా వైరస్ చెప్పుకోదగిన రీతిలో లేదని అంటూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వస్తుండగా, పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తున్నది. దానితో క్షేత్రస్థాయి పరిస్థితులను మదింపు చేయడం కోసం కేంద్ర బృందాలను పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరును సమీక్షించేందుకు నియమించిన ఐఎంసీటీ బృందాలు ఇప్పటికే పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో పర్యటించడం తెలిసిందే. ‌ ఈ బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా సీఆర్‌పీఎ్‌ఫను రంగంలోకి దించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. 

రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో కరోనా ప్రభావం లేదంటూ ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సహితం ప్రధాని మోదీకు ముఖ్యమంత్రి తెలిపారు. వైరస్ తీవ్రంగా వ్యాపించిన కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనే  కేసులు అదుపులోకి రావడం లేదు. 

గురువారం ఒక్కరోజే 80 కొత్త కేసులు నమోదవడంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రంలో మార్చి 12న తొలి కేసు గుర్తించిన తర్వాత ఒకేరోజు ఈ స్థాయిలో ఎప్పుడూ నమోదు కాలేదు. ఏప్రిల్‌ 20వ తేదీన 75 కేసులే ఇప్పటి వరకూ అత్యధికం కాగా ఇప్పుడు ఆ రికార్డు తెరమరుగైంది. పొరుగున ఉన్న తెలంగాణలో సైతం  ఒకేరోజు ఇన్ని కేసులు నమోదవకపోవడం గమనార్హం.

గత నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో 246 కేసులు వెలుగుచూశాయి.తాజా కేసులతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 893కి పెరిగిపోయింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 900కు చేరువ కావడంతో పాటు కర్నూలులో కొన్ని మానవ తప్పిదాలపై ఆరోపణలు రావడాన్ని కూడా కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. 

మరోవంక రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న అంకెల పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  కొన్ని బులెటిన్లలో అంకెల వ్యత్యాసం స్పష్టమవుతున్నది. కరోనా మరణాలను, కేసులను తక్కువగా చేసి చూపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు ఆరోపణలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై పలువురు బిజెపి, టిడిపి నేతల నుండి హోమ్ మంత్రి  అమిత్‌ షా కార్యాలయానికి ఫిర్యాదులు వెడుతున్నాయి. 

స్థానిక పరిస్థితుల నేపథ్యంలో చాలాచోట్ల పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని, లాక్‌డౌన్‌ నిబంధనలను నిక్కచ్చిగా అమలు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.  స్వయంగా వైసిపి ఎమ్యెల్యేలు, ఎంపీలు నిబంధనలకు తిలోదకాలిచ్చి, సాంఘిక దూరం పాటించకుండా బహిరంగంగా, గుంపులుగా తిరుగుతూ ఉండడం, నిబంధనల అమలుకు ప్రయత్నించిన అధికారులపై విరుచుకు పడటం కూడా వెల్లడి అవుతున్నది. 

పోలీసులు సహితం లాక్ డౌన్ పాస్ లు ఉదారంగా ఇస్తుండటం, లాక్ డౌన్ ను హాట్ స్పాట్ లకు పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడం వంటి అంశాలు పరిస్థితి తీవ్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వ ధోరణిపై అనుమానాలకు దారితీస్తుంది.