పాలమూరు జిల్లాకు కర్నూల్ ముప్పు

పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఆ రాష్ట్రంలోనే తీవ్రంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో సరిహద్దు ఇవతల ఉన్న పాత పాలమూరు జిల్లాలో వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్నట్లు తెలంగాణ అధికారులు ఆందోళన చెందుతున్నారు.  కర్నూల్ జిల్లాలోనే 234 పాజిటివ్‌ కేసులు నమోదవడం కలవరానికి గురిచేస్తున్నది. ప్రమాదాన్ని గ్రహించి 25 రోజుల క్రితమే కర్నూల్ తో సరిహద్దును మూసివేసినా వైరస్ వ్యాప్తి చెందడం ఆగడం లేదు. 

కర్నూలులో ఇటీవల కరోనాతో మృతి చెందిన డాక్టర్‌ వద్దకు వెళ్లివచ్చిన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడికి కూడా వైరస్‌ పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ ఆర్‌ఎంపీతో కాంటాక్ట్‌ అయిన దాదాపు 45 మందిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కర్నూలులో కరోనా పాజిటివ్‌ వచ్చిన మరో వైద్యురాలి వద్దకు చికిత్సకోసం వెళ్లినవారికి కూడా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. 

ఇలా వైద్యంకోసం వెళ్లినవారు ఇంకా కొంతమంది ఉన్నట్టు సమాచారం ఉండటంతో వారికోసం అధికారులు గాలిస్తున్నారు. మొత్తం ఐదుగురికి కర్నూలు నుంచి వైరస్‌ వ్యాప్తి చెందినట్టు ప్రాథమికంగా గుర్తించారు. అదే సమయంలో కర్నూలు నుంచి తెలంగాణకు వైరస్‌ వ్యాప్తి చెందినట్టు అక్కడి అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోనూ పేర్కొన్నారు.  

తెలంగాణలోని అలంపూర్‌ ప్రాంతానికి చెందిన వారంతా సరుకులు, వ్యాపారాల నిమిత్తం కర్నూలుకే వెళ్లివస్తుంటారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో సరిహద్దులు మూసివేసినా నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల కోసం వ్యాపారులు అక్కడికే వెళ్లి తీసుకొస్తున్నారు. కర్నూలులో ఎక్కువగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నా వ్యాపారులు మాత్రం ఆగడం లేదు. 

మరోవైపు తుంగభద్ర తీరం వెంట కొన్ని నడకదారులు, బండ్లదారులున్నాయి. పోలీసులు రహదారులపై నిఘా పెంచి, మూసివేస్తే చాలామంది అడ్డదారుల్లో వెళ్తున్నట్టు అధికారులు గుర్తించారు.   

కర్నూలు నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐదుగురికి వైరస్‌ వ్యాప్తి చెందినట్టు ప్రాథమికంగా గుర్తించారు. కర్నూలులో వైద్యం కోసం వెళ్లిన అయిజ మండలం మూగోనిపల్లిలో ఇద్దరికి, అలంపూర్‌ మండలం లింగనవాయికి చెందిన ఒక్కరికి, రాజోళిలో ఒకరికి, ఇటిక్యాల మండలం వల్లూరులో ఒకరికి సోకినట్టు గుర్తించారు. 

జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన చాలామంది ఉద్యోగులు, వ్యాపారస్థులు కర్నూలులో నివాసం ఉంటారు. కర్నూలులోని సంతోష్‌నగర్‌, బస్టాండ్‌ ప్రాంతాల్లో మన రాష్ట్ర ఉద్యోగులు ఎక్కువగా నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఓ ఉద్యోగి కుటుంబానికి కూడా పాజిటివ్‌ వచ్చింది.

ఈ నేపథ్యంలో ఉద్యోగులను కర్నూలుకు పంపించడం లేదు. వారిని స్థానికంగానే ఉండాలని ఆదేశాలిచ్చారు. గద్వాల జిల్లాలో గురువారం పది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు కర్నూలు నుంచి వ్యాప్తిచెందినవికాగా, మిగినవి ‘తబ్లిగీ’కి సంబంధించినవిగా భావిస్తున్నారు. 

గద్వాల పట్టణంలోని మోయిన్‌ మొహల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి, నల్లకుంట, గంజిపేట, రాంనగర్‌కాలనీల్లో ఒక్కొక్కరితోపాటు మరొకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారులు నిర్ధారించారు.

గద్వాల పట్టణంలో 29 మందికి కరోనా సోకగా, వారిలో 15 మంది మొయిన్‌మొహల్లాకు చెందినవారే ఉన్నారు. అనుమానితులను వేగంగా గుర్తించి వారందరినీ క్వారంటైన్‌కు తరలించాలని ప్రత్యేక అధికారి రొనాల్డ్‌ రోస్‌ అధికారులను ఆదేశించారు.