మహారాష్ట్ర మంత్రి జితేంద్రకు వైరస్ 

మహారాష్ట్రలో ఓ మంత్రికి కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. బాధిత మంత్రి ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవద్‌ సెక్యూటిరీ స్టాఫ్‌కు కరోనా సోకడంతోమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ తర్వాత కరోనా పరీక్షలు చేయించుకుంటే నెగిటివ్‌ అని వచ్చింది. కానీ నెగిటివ్‌ వచ్చిన కొద్ది రోజులకే మంత్రికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

జితేంద్ర భద్రతా సిబ్బందితో పాటు ఇంట్లో పని చేసే వంట మనిషికి, పార్టీ కార్యకర్తలకు కూడా కరోనా సోకింది. అయితే మంత్రి జితేంద్ర.. లాక్‌డౌన్‌ పరిస్థితులపై చర్చించేందుకు ముంబ్రా పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న ఓ సీనియర్‌ పోలీసు అధికారితో సమావేశమయ్యారు. గత వారం ఈ పోలీసు ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

దీంతో మంత్రికి కూడా కరోనా పరీక్షలు చేయగా ఆయనకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ పోలీసు అధికారి నుంచి సుమారు 100 మందికి పైగా కరోనా వ్యాప్తి చెందినట్లు ముంబయి పోలీసులు భావిస్తున్నారు. తబ్లిగీ జమాత్‌ సభ్యులను గుర్తించడంలో ఈ పోలీసు అధికారి కీలకపాత్ర పోషించారు. 

పైగా,  వారున్న ప్రాంతాల్లో పర్యటించి వారిని పట్టుకున్నారు. వీరి నుంచి పోలీసు ఆఫీసర్‌కు కరోనా సోకింది. ఆ తర్వాత సదరు పోలీసును సుమారు 100 మంది కలిసి ఉంటారు. ఈ 100 మందిలో పలువురు నాయకులు, జర్నలిస్టులు, పోలీసులు ఉన్నారు. ముంబ్రా పోలీసు స్టేషన్‌ సిబ్బందిని క్వారంటైన్‌ సెంటర్లకు తరలించారు. 

ఇలా ఉండగా, మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా 6,427 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒక్క ముంబయిలోని 4,025 కేసులు నమోదు అయ్యాయి.

నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 778 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముంబయిలో 522 కేసులు నమోదు అయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 283 మంది చనిపోయారు. నిన్న ఒక్కరోజే 14 మంది కరోనాతో మృతి చెందారు.

ముంబయిలోని ధారవి స్లమ్‌ ఏరియాలో మరణాల సంఖ్య 13కు చేరింది. అక్కడ 214 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ధారవి స్లమ్‌ ఏరియాలో సుమారు 8 లక్షల మంది నివసిస్తున్నారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద స్లమ్‌. కరోనా హాట్‌స్పాట్‌గా ముంబయిని కేంద్రం గుర్తించింది.

కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. బృహత్ ‌ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 813 కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేశారు.