కరోనా లేని రాష్ట్రంగా త్రిపుర 

క‌రోనాపై అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్న భార‌తదేశంలో ఒక్కో రాష్ట్రం క‌రోనాను త‌రిమికొట్టడంలో విజ‌య‌వంతంమ‌వుతున్నాయి. త్రిపుర క‌రోనా లేని  రాష్ట్రంగా నిలిచింద‌ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  బిప్ల‌వ్ కుమార్ దేవ్ ప్రకటించారు. రాష్ట్రంలో రెండో పాజిటివ్ కేసు న‌మోదైన వ్య‌క్తి కోలుకున్న త‌ర్వాత క‌రోనా కేసులు లేని రాష్ట్రంగా మారింద‌ని చెప్పారు.

త్రిపురలో తొలుత రెండు క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. మొదటి వ్య‌క్తికి ప్ర‌త్యేక ఐసోలేష‌న్ లో ఉంచి చికిత్స అందించిన త‌ర్వాత మ‌ళ్లీ ప‌రీక్ష చేస్తే నెగెటివ్ వ‌చ్చింది. ఇపుడు రెండో వ్య‌క్తికి కూడా నెగెటివ్ రావ‌డంతో అన్ని డిశ్చార్జ్ చేశామ‌ని సీఎం విప్ల‌వ్ కుమార్ దేవ్  వెల్ల‌డించారు. 

గత వారమే గోవా, మణిపూర్ ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలను కరోనా లేని రాష్ట్రాలుగా ప్రకటించుకోవడం తెలిసిందే. ఇప్పుడు వాటి సరసన త్రిపుర మూడో రాష్ట్రంగా నిలిచింది. 

కాగా, భారత్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 1684 కరోనా పాజిటివ్ కేసులు, 37 కరోనా మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తాజాగా వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి కరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ 23,000 మార్క్‌ను దాటింది.  

భారత్‌లో ఇప్పటివరకూ 23,077 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 718 మంది కరోనా వల్ల మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 17610 కాగా.. 4749 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.