ఐసోలేష‌న్‌లో ఫిన్‌ల్యాండ్ ప్ర‌ధాని

ఫిన్‌ల్యాండ్ ప్ర‌ధాని స‌న్నా మారిన్‌ సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్ల‌నున్నారు. ప్ర‌ధాని నివాసంలో ఒక‌రికి వైర‌స్ సోకిన‌ట్లు ద్రువీక‌రించారు. దీంతో ప్ర‌ధాని మారిన్‌కు కూడా వైర‌స్ ప‌రీక్ష‌లు చేప‌ట్టారు. కానీ ముందు జాగ్ర‌త్త‌గా తాను ఇంటి నుంచే ప‌నిచేయ‌నున్న‌ట్లు ప్ర‌ధాని మారిన్ తెలిపారు.  

34 ఏళ్ల మారిన్ గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ప్ర‌ధానిగా ఎన్నిక‌య్యారు. ప్ర‌పంచ‌దేశాల్లోనే ప్ర‌ధాని బాధ్య‌త చేప‌ట్టిన అతి పిన్న వ‌య‌సున్న వ్య‌క్తిగా ఆమె రికార్డు సృష్టించారు. 

కాగా, క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కోవ‌డం ప్ర‌జాస్వామ్యానికి పెద్ద స‌వాల్‌గా మారింద‌ని జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఏంజెలా మెర్క‌ల్ తెలిపారు. బెర్లిన్‌లోని పార్ల‌మెంట్‌లో ఆమె ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఈయూ బ‌డ్జెట్‌కు భారీగా నిధుల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. ఐరోపా ఐక్యంగా ఉండేందుకు వైర‌స్ పెను స‌వాల్‌గా త‌యారైంద‌ని ఆమె పేర్కొన్నారు. 

ప్ర‌జ‌ల జీవితానికి, ఆరోగ్యానికి రెండో ప్ర‌పంచ యుద్ధ త‌ర్వాత ఎదురైన‌ అతిపెద్ద సవాల్ ఇదే అని ఆమె తెలిపారు. అయితే వీలైనంత క్ర‌మ‌శిక్ష‌ణ పాటిస్తే, చాలా త్వ‌ర‌గా సుర‌క్షిత వాతావర‌ణానికి రాగ‌లుగుతామ‌ని విశ్వాసం వ్యక్తం చేశారు. స‌మ‌యాన్నివృధా చేయ‌రాద‌ని హితవు చెప్పారు. ఇత‌రుల‌పై ఆధార‌ప‌డ‌డం క‌న్నా ప్ర‌త్యేక మెడిక‌ల్ కిట్ల గురించి ఐరోపా దేశాలు సిద్ధం కావాలని పిలుపిచ్చారు.