రైతుల ఇబ్బందులపై బిజెపి రేపు ఉపవాసదీక్ష 

తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై శుక్రవారం హైదరాబాద్ లోని రాష్ట్ర బిజెపి కార్యాలయంలో ఉపవాసదీక్ష జరుపుతున్నట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుందని తెలిపారు. 

లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే , బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, పదాధికారులు, జిల్లా, మండల అధ్యక్షులు తమ తమ ఇండ్లలోనే ఈ దీక్ష చేయాలని సంజయ్ పిలుపునిచ్చారు.    

రాష్ట్రంలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికచ్చే సమయానికి విధించిన లాక్ డౌన్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. కూలీలు దొరకక , ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చెయ్యక, ఐకెపి సెంటర్లలో సరైన ఏర్పాట్లు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

గత వారం రోజులుగా బీజేపీ రాష్ట్ర శాఖ నుండి ప్రభుత్వం దృష్టికి  తీసుకెళ్లినా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల సంజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. రైతులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని, ఎవ్వరు ధైర్యం కొల్పవద్దని, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవస్తామని ఆయన భరోసా ఇచ్చారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది సమృద్ధిగా పంటలు పండడంతో  రైతులతో ధావత్ చేసుకోవాలని ఉందని ప్రకటించిన సీఎం కేసీఆర్ వారి కష్టాలను మాత్రం పట్టించుకోవడం లేదని సంజయ్ విమర్శించారు. మార్కెట్ లు బంద్ కావడంతో ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు సతమతం అవుతున్నారని తెలిపారు. 

ఐకెపి సెంటర్లలో చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తాం అని సీఎం కేసీఆర్ ప్రకటించినా, క్షేత్ర స్థాయిలో అది జరగడం లేదని చెప్పారు. జిల్లాలో అధికారులు సమన్వయ లోపంతో కొనుగోళ్లు ఇప్పటికి ప్రారంభం కాకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.