దేశంలో తొలి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ హైదరాబాద్‌లో

ఈఎస్‌ఐ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆన్‌లైన్‌ద్వారా ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, అధునాతన సాంకేతికతతో  బయోసేఫ్టీ లెవల్‌ (బీఎస్‌ఎల్‌)- 3 వైరాలజీ ల్యాబ్‌ను రూపొందించారు. 

కొవిడ్-19 స్క్రీనింగ్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కోసం సంచార ల్యాబొరేటరీని అభివృద్ధి చేసినందుకుడీఆర్‌డీవోను రక్షణమంత్రి ప్రశంసించారు. ఈ తరహా మొబైల్ ల్యాబ్‌ ఇదే మొద‌టిద‌న్న రాజ్‌నాథ్ దీనిని డీఆర్‌డీవో రికార్డు సమయంలో అభివృద్ధిపరచిందని తెలిపారు. 

రక్షణ శాఖ‌, సాయుద దళాలు చేస్తున్న అవిశ్రాంత కృషివల్ల కొవిడ్-19పై యుద్ధంచేసే సామర్థ్యం మరింత పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఈ మొబైల్ ల్యాబ్ రోజుకు 1,000కిపైగా శాంపిల్స్‌ను స్క్రీనింగ్ చేస్తుంద‌ని రాజ్‌నాథ్‌ చెప్పారు.   

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు  సంతోష్ గంగ్వార్, కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఐక్లీన్‌, ఐ సేఫ్‌ సంస్థల సహకారంతో డీఆర్‌డీవో ఈ ల్యాబ్‌ను తయారుచేసింది. కరోనా పరీక్షలతోపాటు, వైరస్‌ కల్చర్‌, వ్యాక్సిన్‌ తయారీపై ఈ ల్యాబ్‌ పనిచేయనుంది.

ఇప్పటి వరకు పుణెలో వైరాలజీ ల్యాబ్ ఉండేది. కరోనా కేసులు పెరుగుతుండటంతో సాధ్యమైనంత వేగంగా మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రమే ఇలాంటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ఉన్నాయి.

కానీ మన దేశంలో మొదటగా హైదరాబాద్ లో దీన్ని ఏర్పాటు చేయటం విశేషం. 15 రోజుల వ్యవధిలోనే రెండు కంటైనర్లలో డీఆర్డీఓ శాస్త్రవేత్తలు దీన్నిసిద్ధం చేశారు. కరోనా టెస్ట్ లతో పాటు వైరస్ కల్చర్, వ్యాక్సిన్ తయారీకి ఈ ల్యాబ్ ఉపయోగించనున్నారు.