హర్యానాలో జర్నలిస్ట్ లకు రూ 10 లక్షల ప్రమాద భీమా

కరోనా వైరస్ పట్ల ప్రజలలో చైతన్యం తీసుకు రావడంలో కీలక భూమిక వహిస్తున్న జర్నలిస్ట్ లు సహితం ఈ వైరస్ కు గురవుతూ ఉండడంతో, దేశ వ్యాప్తంగా వారి భద్రత పట్ల ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో దేశంలో మొదటిసారిగా హర్యానా ప్రభుత్వం వారికి రూ 10 లక్షల ప్రమాద భీమా సదుపాయం కల్పిస్తూ నిర్ణయం తీసుకోంది. 

ప్రతి జర్నలిస్టుకు రూ. 10 లక్షల చొప్పున బీమా కల్పిస్తున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌ ఖట్టర్ ప్రకటించారు. ఇప్పటి వరకు కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందుంటున్న డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులను మాత్రమే `పోరాట యోధులు'గా గుర్తించి, వారి భద్రత, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిర్ణయాలు తీసుకొంటున్నాయి. 

అయితే ముంబైలో 167 మందికి కరోనా పరీక్షలు జరుపగా 53 మందికి పాజిటివ్ రావడం, చెన్నైలో ఒకే సంస్థలో 24 మందికి పాజిటివ్ రావడంతో దేశవ్యాప్తంగా వారి భద్రత పట్ల ఆందోళనలు చెలరేగుతున్నాయి. 

ప్రస్తుత క్లిష్ట సమయంలో వారిని ఆదుకొనేందుకు మీడియా యాజమాన్యాలు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. పైగా పలు సంస్థలు తమ ఉద్యోగుల జీతాలతో కోతలు విధించాయి. 

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మీడియా సంస్థలకు ఒక లేఖ వ్రాసినా అందులో జర్నలిస్టులు తమ గురించి తాము జాగ్రత్తలు తీసుకోవాలని, మిడియా యాజమాన్యాలు సహితం తమ సిబ్బంది పట్ల జాగ్రత్త వహించాలని మొక్కుబడి పదాలు వాడినా, నిర్దుష్టమైన అంశాలను ఏవీ లేవు.