ఇప్ప‌ట్లో క‌రోనా వైర‌స్ క‌థ ముగిసిపోదు 

ఇప్ప‌ట్లో అప్పుడే క‌రోనా వైరముగిసిపోదని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ  స్పష్టం చేసింది.  వైర‌స్‌తో మ‌నం ఇంకా చాలా దూరం ప్ర‌యాణించాల్సి ఉంటుంద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైర‌క్ట‌ర్ టెడ్రోస్  హెచ్చరించారు. చాలా వ‌ర‌కు దేశాలు ఇంకా తొలి ద‌శ‌లోనే ఉన్నాయని పేర్కొ‌న్నారు. 

వైర‌స్‌ను నియంత్రించామని చెబుతున్న కొన్ని దేశాల్లో మ‌ళ్లీ కొత్త‌గా కేసులు బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు. ఆఫ్రికాలో ఇప్పుడిప్పుడే కేసులు అధిక‌మ‌వుతున్నాయని చెప్పారు. మ‌రోవైపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య ల‌క్షా 80 వేలు దాటింది. 

జ‌న‌వ‌రి 30వ తేదీన గ్లోబ‌ల్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన‌ట్లు టెడ్రోస్ గుర్తు చేశారు. డ‌బ్ల్యూహెచ్‌వోపై అమెరికా ఆరోప‌ణ‌లు చేస్తున్నా.. తాను మాత్రం రాజీనామా చేసేది లేద‌ని టెడ్రోస్‌ స్పష్టం చేశారు. ప‌శ్చిమ ఐరోపా‌లో మ‌హ‌మ్మారి ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు టెడ్రోస్ చెప్పారు. 

ప్ర‌స్తుత ద‌శ‌లో ఎవ‌రూ ఎటువంటి పొర‌పాట్లు చేయ‌కూడ‌ద‌ని హితవు చెప్పారు.  మ‌నం ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని చెబుతూ ఈ వైర‌స్ మ‌న‌తో చాలా కాల‌మే ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు.  

నిధుల విష‌యంలో అమెరికా మ‌ళ్లీ పున‌రాలోచించాల‌ని టెడ్రోస్ కోరారు.  డ‌బ్ల్యూహెచ్‌వోకు మ‌ళ్లీ అమెరికా నిధులు ఇస్తుంద‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. ఇది ముఖ్య‌మైన పెట్టుబ‌డిగా అమెరికా భావిస్తుంద‌ని అనుకుంటున్నట్లు చెప్పారు. 

అలా చేయ‌డం వ‌ల్ల ఇత‌రుల‌ను ఆదుకోవ‌డ‌మే కాదు, అమెరికా కూడా సుర‌క్షితంగా ఉంటుంద‌ని సూచించారు.  గ‌త ఏడాది డ‌బ్ల్యూహెచ్‌వోకు అమెరికా 400 మిలియ‌న్ల డాల‌ర్లు ఇచ్చింది.