తెలంగాణలో హోం క్వారంటైన్‌ ఇకపై 28 రోజులు 

కరోనా వైరస్‌ అనుమానితులు తప్పనిసరిగా ఇకపై 28 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఇదివరకు వైరస్‌ సోకినవారిలో 14 రోజులకు వ్యాధి లక్షణాలు బయటపడగా, ఇప్పుడు నెలరోజులవరకూ తెలియడంలేదు. దీంతో వైరస్‌ అనుమానితులను 28 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేశారు. కరోనా సోకిన వ్యక్తితో కాంటాక్ట్‌ అయినవారు ఇకపై 28 రోజులపాటు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రైమరీ కాంటాక్ట్‌లకు మాత్రమే కరోనా పరీక్షలు చేయాలని, సెకండరీ కాంటాక్ట్‌లకు చేయొద్దని కలెక్టర్లకు స్పష్టతనిచ్చింది. 

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తిని నేరుగా కలుసుకునే కుటుంబసభ్యులు లేదా సన్నిహితులను ప్రైమరీ కాంటాక్ట్స్‌ అని, వీరిని కలుసుకునే ఇతరులను సెకండరీ కాంటాక్ట్స్‌ అని అంటారు. ప్రైమరీ కాంటాక్ట్‌లకు వ్యాధి లక్షణాలుంటే.. వారిని ప్రభుత్వం నిర్దేశించిన ఐసొలేషన్‌ కేంద్రాలకు తరలిస్తారు. 

సెకండరీ కాంటాక్ట్‌లు తప్పనిసరిగా 28రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టంచేసింది. హోం క్వారంటైన్‌లో ఉన్నవారిని వైద్య బృందాలు ప్రతిరోజు వెళ్లి పరిశీలించాలని ఆదేశించింది. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన రోగుల్లో కూడా 20 రోజుల తరువాతనే వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని వైద్యాధికారులు వెల్లడించారు. 

ఇటీవల కీసర మండలంలో ఒక వ్యక్తికి 50 రోజుల తరువాత లక్షణాలు కనిపించాయి. ఇది చాలా ప్రమాదకరమని, లక్షణాలు ఆలస్యంగా బయటపడటం వల్ల సదరు రోగి తనకు తెలియకుండానే ఇతరులకు వైరస్‌ను అంటించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు హెచ్చరించారు.