రోబోలను ఉపయోగించనున్న ఢిల్లీ ఎయిమ్స్‌  

కరోనా రోగులకు చికిత్సనందిస్తూ ఎంతోమంది వైద్యులు ఆ మహమ్మారిబారిన పడుతున్నారు. అయితే, విశ్వమారి నుంచి డాక్టర్లను, వైద్య సిబ్బందిని రక్షించేందుకు మర మనుషులు (రోబోలు) రంగంలోకి దిగబోతున్నాయి. 

ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) దవాఖానలో రోబోల సేవల్ని వినియోగించుకునేందుకు అధికారులు రోబో తయారీ సంస్థ ‘మిలాగ్రో’తో జట్టు కడుతున్నారు. 

మిలాగ్రో హ్యూమనాయిడ్‌ ఈఎల్‌ఎఫ్‌, మిలాగ్రో ఫ్లోర్‌ రోబోట్‌ ఐమ్యాప్‌9.0 పేరుగల ఈ రెండు రోబోలు వైరస్‌ సోకిన రోగుల్ని పర్యవేక్షించడం, పేషెంట్లతో డాక్టర్లు వర్చువల్‌ (దృశ్య మాధ్యమం ద్వారా)గా మాట్లాడటం, దవాఖానలోని కారిడార్లు, ఫ్లోర్లను శుభ్రం చేయడం వంటి పనుల్ని చేస్తాయని మిలాగ్రో సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటలీజెన్స్‌) సాయంతో ఈ రోబోలు పనిచేస్తాయని వివరించారు. రోబో సాయంతో ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్న రోగులు తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడవచ్చు. వార్డులోని దృశ్యాల్ని అత్యంత నాణ్యతతో (హైడెఫినేషన్‌) చిత్రీకరించగలదు. శబ్దాల్ని రికార్డు చేయగలదు.

 92 సెంటీ మీటర్ల ఎత్తుతో ఉండే ఈ రోబోట్‌లో 60 సెన్సార్లు, ఒక 3డీ, ఒక హెచ్‌డీ కెమెరా, 10.1 ఇంచుల డిస్‌ప్లే స్క్రీన్‌ ఉంది. 8 గంటల పాటు నిరంతరంగా పనిచేసే బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ రోబోట్‌.. గంటకు 2.9 కి. మీ. వేగంతో ప్రయాణించగలదు.