భారత సంతతి వైద్యురాలికి అరుదైన గౌరవం 

అమెరికాలో కరోనా రోగులకు అంకిత భావంతో సేవలు అందిస్తున్న భారత సంతతికి చెందిన వైద్యురాలికి `డ్రైవ్ అఫ్ హానర్' అంటూ అరుదైన గౌరవం లభించింది. తన ఆరోగ్య భద్రతను సహితం లెక్కచేయకుండా వైరస్ సోకిన వారిని కాపాడటం కోసం ఆమె అందించిన సేవలకు కృతజ్ఞతగా ఈ గౌరవం లభించింది. కోలుకున్నవారితోపాటు పోలీసులు ఆమె ఇంటి ముందు తమ వాహనాలతో పరేడ్‌ నిర్వహిస్తూ  సెల్యూట్‌ చేశారు.

మైసూరుకు చెందిన డా ఉమా రాణి మధుసూదన ప్రస్తుతం కనెక్టికట్ లోని సౌత్ విండ్సర్ హాస్పిటల్ లో పనిచేస్తున్నారు.  కర్ణాటక ముఖ్యమంత్రి వి ఎస్ యెడియూరప్పతో సహా పలువురు కర్ణాటక మంత్రులు ఆమెను ఈ సందర్భంగా అభినందించారు.  రోగులకు ఆమె అందించిన సేవలను కొనియాడారు. 

ఆమె చికిత్స కారణంగా కరోనా వైరస్ నుండి కోలుకున్న వారు ఆమెను చేసిన సత్కారంకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది. 

ఆ వీడియోలో,  అఆమే తన ఇంటిముందు పచ్చికబయలులో నిలబడి ఉండగా వందకు పైగా పోలీసు వాహనాలు, అగ్నిమాపక ఇంజన్లు,  ప్రైవేట్ వాహనాలు ఆమె ఇంటి ముందు సైరన్లు మోగిస్తూ,  అభినందనలు చేస్తూ పరేడ్ నిర్వహించారు. వాహనాల కాన్వాయ్ డాక్టర్ ఉమా ఇంటి ముందు  కొన్ని సెకన్ల పాటు ఆపి, "భారీ ధన్యవాదాలు" అంటూ  ప్లే కార్డులతో ఆమెకు కృతజ్ఞతలు తెలిపింది.

ఆమె 1990లో మైసూరులోని జె ఎస్ ఎస్ మెడికల్ కాలేజీలో వైద్య డిగ్రీని పూర్తి చేశారు. "ఆమె మా కాలేజీలో ఉన్నప్పుడు కూడా అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థిని. ఇప్పుడు అమెరికాలో అపూర్వమైన సేవలు అందించడం ద్వారా మేమంతా గర్వపడేటట్లు చేస్తున్నారు" అంటూ ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డా  హెచ్ బసవనగౌడప్ప ప్రశంసించారు. 

"కర్ణాటకకు చెందిన ఈ వైద్యురాలిని చూసి మేము గర్విస్తున్నాము. ఆమెకు మా అభినందనలు" అని యడ్యూరప్ప ట్విట్టర్ లో ప్రశంసించారు. 

"నేను మైసూర్ వెళ్ళినప్పుడు ఆ వీడియోను చూడడం ఎంతో ఆనందం కలిగించింది. అదొక్క అందమైన దృశ్యం. డా. ఉమకు ధన్యవాదాలు తెలపడానికి కారులు, పోలీస్ వాహనాలు, అగ్నిమాపక వాహనాలు బారులుతీరి కృతజ్ఞతగా వందనం చేయడం అపూర్వమైన దృశ్యం" అంటూ కర్ణాటక వైద్య విద్యా  మంత్రి డా. కె సుధాకర్ ట్వీట్ చేశారు.