ప్రధాని మోదీపై బిల్ గేట్స్ ప్రశంసలు 

కరోనా వైరస్ (కోవిడ్ – 19) ను కట్టడి చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలను మైక్రోసాఫ్ట్ మాజీ అధినేత  బిల్ గేట్స్ కొనియాడారు. మోడీ నాయకత్వంలో.. కరోనాను భారత్ అద్భుతంగా ఎదుర్కొంటోందని ఆయన ప్రశంసించారు. 

ఈ విషయమై ప్రధాని మోడీకి ఆయన ఓ లేఖ వ్రాస్తూ "మీ నాయకత్వంలో కరోనాను చాలా బాగా కట్టడి చేస్తున్నారు.  వైరస్ వ్యాపిస్తుందన్న దశలోనే లాక్ డౌన్ విధించారు. దీంతో పాటు లాక్ డౌన్ ను పొడిగించారు. అందుకే భారత్ లో తక్కువ కేసులు నమోదవుతున్నాయి" అంటూ పేర్కొన్నారు.

కరోనా వ్యాపిస్తున్న ప్రాంతాలను గుర్తించి హాట్ స్పాట్ లుగా తొందరగా ప్రకటించారని, క్వారెంటెన్ లపై తీసుకున్న వేగవంతమైన నిర్ణయాలు భారత్ ను సురక్షిత స్థానంలో ఉంచాయని గేట్స్ తెలిపారు. 

మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆరోగ్యంపై అధిక నిధులు వెచ్చించడం, ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచడం సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలని బిల్‌ గేట్స్‌ కొనియాడారు. ఆరోగ్యానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు చేశారని, దీంతో పాటు డిజిటల్ టెక్నాలజీని ఇందులో భాగం చేశారని ప్రశంసించారు. 

ఆరోగ్య సేతు యాప్ ను లాంచ్ చేసి కరోనా కట్టడికి మరో మెట్టు ఎక్కారని బిల్ గేట్స్ అభినందించారు. ఈ నిర్ణయం తనను చాలా ఆనందానికి గురి చేసిందని చెప్పారు. ఆరోగ్య సేతు కరోనా వైరస్ ట్రాకింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ లేఖలో వివరించారు.