ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర రద్దు

కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర రద్దు అయింది. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూన్‌ 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఉండే అమర్‌నాథ్‌ యాత్ర రద్దు చేస్తూ ఆదేశాలు వెలువరించారు. 

జమ్ము లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గిరిశ్‌ చంద్ర ముర్ము, శ్రీ అమర్‌నాథ్‌జీ ష్రైన్‌ బోర్డు చైర్మన్‌ రాజ్‌భవన్‌లో జరిపిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కశ్మీర్‌ లోయలో యాత్ర కొనసాగే మార్గాల్లోని 77 ప్రాంతాలు రెడ్‌ జోన్‌గా ప్రకటింపబడ్డాయి. 

దీంతో లాంగర్స్‌, వైద్య సదుపాయాలు, క్యాంపుల ఏర్పాటు, వస్తువులను సమకూర్చడం, మంచును క్లియర్‌ చేయడం వీలుపడేటట్లుగా లేదు. యాత్రికుల రక్షణ తమ ప్రాధాన్యం అని కావునా కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో యాత్ర నిర్వహణ వీలుపడదని బోర్డు వెల్లడించింది. 

 ప్రతమ్‌ పూజ, సంపన్‌ పూజ సాంప్రదాయ ప్రకారం యథావిధిగా నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల కోసం శివలింగ పూజ, దర్శనంను ఆన్‌లైన్‌లో అదేవిధంగా ఇతర మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు బోర్డు పేర్కొంది. 

ప్రతి ఏడాది జూన్ 23న 42 రోజుల అమర్‌నాథ్ వార్షిక యాత్ర ప్రారంభమవుతుంది.