భారత్ లో 20 వేలు దాటిన కరోనా కేసులు 

భారత దేశంలో కరోనా వైరస్‌ కేసులు 20 వేలు దాటాయి.  బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 1,486 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య దేశంలో 20,471కు చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో 49 మంది మృత్యువాతపడ్డారు. కోవిడ్‌-19 కారణంగా ఇప్పటి వరకు 652 మంది మృతిచెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే  లాక్‌డౌన్‌ కారణంగా కరోనా వైరస్‌ వ్యాప్తి ‌ తగ్గినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 

దేశంలోని 403 జిల్లాలకు వైరస్‌ విస్తరించింది. ముంబయి 3 వేల కేసులతో అగ్రభాగంలో  కొనసాగుతుండగా తర్వాతి స్థానాల్లో ఢిల్లీ-2,081, అహ్మదాబాద్‌-1,298, ఇండోర్‌-915, పూణె-660, జైపూర్‌లో 537 కేసులు నమోదయ్యాయి. 

60 శాతానికి పైగా కేసులు మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, తమిళనాడు ఈ ఐదు రాష్ర్టాల్లోనే నమోదయ్యాయి. భారత్‌లో నేటి వరకు 20,471 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వీటిలో 15,859 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 3,960 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 652 మంది ఇప్పటివరకు మృతిచెందారు.  

ఇలా  ఉండగా,ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఈ నెల 27న మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌నున్నారు. దేశంలో కొవిడ్‌-19 ప‌రిస్థితి, లాక్‌డౌన్ స‌డ‌లింపులు త‌దిత‌ర అంశాల‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. 

మే 3 నుంచి లాక్‌డౌన్ ఎత్తివేత విష‌యంపై కూడా ఈ స‌మావేశంలో ప్ర‌ధాని సీఎంల అభిప్రాయాలు తెలుసుకోనున్న‌ట్లు స‌మాచారం. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో క‌రోనా ప‌రిస్థితి, తీసుకుంటున్న చ‌ర్య‌లు మొద‌లైన అంశాలపై కూడా ప్ర‌ధాని ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో చ‌ర్చించే అవ‌కాశం ఉంది.