వైరస్‌ రోగులను సరిహద్దు దాటిస్తున్న పాక్‌

కరోనా వైరస్‌ రోగులను భారత్‌లోకి పాకిస్తాన్‌ ఎగుమతి చేస్తోందని జమ్మూ కాశ్మీర్  డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ ఆరోపించారు.  గతంలో ఉగ్రవాదులను మన దేశంలోకి పంపిన పాకిస్తాన్‌ తాజాగా కరోనా వైరస్‌ రోగులను పంపుతున్న విషయం వెలుగులోకి వచ్చిందని, ఇది ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. 

పాక్ నుంచి మన దేశంలోకి వచ్చిన కరోనా రోగులు ఇక్కడ వైరస్‌ను వ్యాపించచేస్తున్నారని దుయ్యబట్టారు. పాక్‌ దుశ్చర్యపై మనం మేలుకుని ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. 

ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై పోరాడుతున్న సమయంలోనూ భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ విద్రోహ కార్యకలాపాలను సాగిస్తూనే ఉందని ఆయన మండిపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్‌ జమ్ము కశ్మీర్‌లోకి వైరస్‌ రోగులను పంపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు, వారి శిక్షణా కేంద్రాలలో కూడా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా వ్యాపించినట్లు నివేదికలు తెలుపుతున్నాయని పోలీస్ ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన విల్లడించారు. రాష్ట్ర గవర్నర్ సలహాదారుడు ఆర్ ఆర్ భట్నాగర్  కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ప్రస్తుత ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితులలో ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడం కోసం మన సాయుధ దళాలు అవిశ్రామంగా కృషి చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులను చొప్పించి, ఇక్కడ కల్లోలం సృష్టించే ప్రయత్నాలను విడనాడటం లేదని దిలీబాగ్ సింగ్ విమర్శించారు. 

ఒకవంక సరిహద్దు అవతల నుండి పాకిస్తాన్ జరుపుతున్న కుతంత్రాలను ఎదుర్కొంటూనే మరోవంక జమ్మూ, కాశ్మీర్ లో కరోనా వ్యతిరేక పోరాటంలో, లాక్ డౌన్ అమలు జరపడంలో ఆరోగ్య శాఖకు, పౌర పాలనా యంత్రాంగానికి సైనికులు, పోలీసులు అందిస్తున్న సహకారాన్ని భట్నాగర్ కొనియాడారు.