స్వీయ నిర్బంధంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 

గతవారం తాను కలిసిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు తేలడంతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అలాగే, కరోనా పరీక్షల నిమిత్తం ఆయన నుంచి వైద్యులు గత రాత్రి శాంపిళ్లు సేకరించారు. వాటి ఫలితాలు ఈ రోజే వచ్చే అవకాశం ఉందని ఇమ్రాన్ వ్యక్తిగత వైద్యుడు ఫైసల్ సుల్తాన్ తెలిపారు.

ఇమ్రాన్ ఈ నెల 15వ తేదీన ఇస్లామాబాద్‌లో ప్రముఖ దాత, ఎధి ఫౌండేషన్ చైర్మన్ ఫైసల్ ఎధిని కలిశారు. ఈ సందర్భంగా ఎధి.. కరోనా వైరస్ సహాయ నిధి కోసం రూ. పది మిలియన్ రూపాయల చెక్‌ను ప్రధానికి అందజేశారు. 

ఇమ్రాన్‌ను కలిసిన కొద్ది రోజులకే ఎధిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. లక్షణాలు నాలుగు రోజుల పాటు ఉండడంతో ఆయనకు పరీక్షలు చేయగా.. కరోనా వైరస్ సోకినట్టు తేలింది. 

దాంతో, అప్రమత్తమైన ఇమ్రాన్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లి.. పరీక్ష చేయించుకున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఇమ్రాన్‌ క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తే ప్రభుత్వాన్ని ఆయన ఎలా నడిపిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.  

కాగా పాకిస్తాన్‌లో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే 705 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 9749కు చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 209 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో మసీదుల్లో రంజాన్‌ ప్రార్థనలకు ఇమ్రాన్‌ సర్కారు అనుమతినివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.