ప్రభుత్వంపై పోరాడుతున్నందుకే టార్గెట్‌   

ప్రభుత్వంపై పోరాడుతున్నందుకు వైసిపి నేతలు తనను టార్గెట్‌ చేస్తున్నారని బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.  వైసీపీ వాళ్లు బెదిరిస్తే బెదరమని... ప్రజాసమస్యలపై పోరాడతామని కన్నాస్పష్టం చేశారు. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ పారదర్శకత నిరూపించుకోవాలని హితవు చెప్పారు. 

ఏపీలో కరోనా విజృంభిస్తోందని చెబుతూ కరోనా సామాజిక వ్యాప్తి పెచ్చరిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. కరోనాపై వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడంలేదని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా తిరుగుతున్నారని అంటూ వారి వల్లననే ఎమ్మెల్యే కరోనా సామాజిక వ్యాప్తి చెందుతుందని చెప్పారు. 

కరోనాపై వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దాస్తోందని కన్నా విమర్శించారు. రాజకీయాలే పరమావధిగా వైసీపీ పని చేస్తోందని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలను వైసీపీ గాలికొదిలేసిందని మండిపడ్డారు. అధికారమదంతో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.   

వైసీపీ నేతల తీరుతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని కన్నా విమర్శించారు. వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుని కేంద్రంపై నెడుతున్నారని మండిపడ్డారు. 

వైసీపీ చేతగానితనాన్ని ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యక్తిగత దూషణలు చేయడం దిగజారుడుతనమేనని కన్నా విమర్శించారు. తనను బీజేపీకి వేరుచేస్తూ వైసిపి నేతలు మాట్లాడటంపై మండిపడ్డారు. తనకు బిజెపి తరుపునే పోరాడుతున్నానని, తన వ్యక్తిగతం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో డబ్బులు పంచే సంప్రదాయం బీజేపీది కాదని చెప్పారు.