రైతులకు రెండు శాతం వడ్డీ రాయితీ

కరోనా వ్యాప్తితో ఆర్ధికంగా చితికిపోతున్న రైతులను ఆదుకునేరదుకు రిజర్వ్‌బ్యారకు వడ్డీ రాయితీ పథకాన్ని ప్రకటించింది. 

దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగం పెను సంక్షోభం ఎదుర్కుంటున్న నేపథ్యంలో మార్చి నుండి మే నెలలోపు బకాయి మొత్తాన్ని చెల్లించే వారికి రెండు శాతం వడ్డీని రాయితీగా ఇవ్వనున్నట్లు రిజర్వుబ్యాంకు తెలిపింది. 

మార్చి నుండి మే వరకు మూడు నెలల పాటు ఈ పథకం అమలులో ఉంటుంది. నిర్దేశించిన గడువులోపుగా సకాలంలో చెల్లించేవారికి మరో మూడు శాతం ప్రోత్సహకాన్ని కూడా రిజర్వుబ్యాంకు ప్రకటించింది. 

అయితే. ఈ మొత్తాన్ని ముందు బ్యాంకులు రైతులకు ఇవ్వాల్సిఉంటుంది. ఆ తరువాత ప్రభుత్వం బ్యాంకులకు భర్తీ చేస్తుంది. మూడు లక్షల రూపాయల వరకు స్వల్పకాలిక రుణం తీసుకున్న వారికి ఈ పథకం అమలవుతుంది. 

ఇలా ఉండగా,  కరోనా తొలి దెబ్బ ఖరీఫ్‌ రైతులపై పడనుంది. అంతర్జాతీయంగా లాక్‌డౌన్‌ల వలన మన దేశానికి రావాల్సిన ఫాస్పేట్‌ దిగుమతులు నిలిచిపోయాయి. ఇదే అదనుగా దేశంలో ఎరువులను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన 30 వరకు ప్రధాన సంస్థలు తక్షణం ధరలు పెంచేందుకు సిద్ధ మయ్యాయి. 

మన దేశం ఏటా 60 లక్షల టన్నుల ఫాస్పేట్‌ను చైనా, మొరాకో నుంచి దిగుమతి చేసుకుంటోంది. కరోనాతో ఆయా దేశాల నుంచి ఫాస్పేట్‌ దిగుమతులు నిలిచిపోయాయన్నది ఎరువుల కంపెనీల వాదన. అందుకే డిఎపి, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెంచుతున్నామంటున్నాయి.  యాభై కిలోల డిఎపి బస్తాపై రూ.50, కాంప్లెక్స్‌ ఎరువులు రూ.25 చొప్పున ధరలు పెరగనున్నాయి.