ఆర్‌బిఐ నుండి తెలంగాణ రూ 2,000 కోట్ల ఋణం 

లాక్‌డౌన్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో రూ 2,000 కోట్లను రుణంగా తీసుకుంది. స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ (ఎస్‌డిఎల్) కింద బాండ్ల అమ్మకాలు, సెక్యూరిటీల ద్వారా ఈ రుణాన్ని పొందింది. మొత్తం ఆరు 6 రాష్ట్రాలు ఆర్‌బిఐ నిర్వహించిన వేలంలో పాల్గొన్నాయి. 

ఎపి, మిజోరం, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రం తీసుకున్న రుణంలో రూ 1,000 కోట్లను 2026కు, మరో రూ.1,000 కోట్లను 2028 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 13వ తేదీన కూడా ప్రభుత్వం బాండ్ల అమ్మకాల ద్వారా రూ.2,000 కోట్లు ఆర్‌బిఐ నుంచి అప్పు గా తీసుకుంది. 

దీంతో ఈ నెలలోనే రూ.4,000 కోట్ల రుణం తీసుకుంది. ఇక ఇటీవల కేంద్రం డబ్లుఎంఎ పరిమితి 60 శాతం పెంచడంతో రూ.1768 కోట్లు తీసుకోవాలని భావిస్తోంది. వీటిని మే మాసంలో తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ ప్రకటించే మరిన్ని ఆర్థిక ఉద్దీపన ప్రకటనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోంది. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రేషన్‌కార్డు కుటుంబానికి రూ.1500 చొప్పున ఇవ్వడంతో పాటు 12 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. వీటికి రూ.1190 కోట్లు ఖర్చు అవుతోంది. ఏప్రిల్ నెలకు కూడా ఉచిత బియ్యం, రూ.1500 పంపిణీ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ నిధులను వాటికి వినియోగించనుంది. 

అలాగే ఆసరా పింఛన్‌లు కూడా ప్రభుత్వం ఆపేయడం లేదు. వీటికి కూడా రుణాల నుంచి వచ్చిన సొమ్మునే వాడుకోనుంది. ఉద్యోగుల జీతాలు, కొవిడ్ 19 కట్టడి, చికిత్సకు అవసరమయ్యే నిధులను ఇందులో నుంచే వినియోగించనున్నారు.