రుణాల పరిమితిని కుదిస్తున్న బ్యాంకులు 

కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌ కారణంగా వేతనాల కోత, ఉద్యోగాలు కోల్పోవడం వంటి వాటితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బ్యాంకులు మరో షాక్‌ ఇస్తున్నాయి. ఇప్పటివరకూ వినియోగదారులకు ఇచ్చిన క్రెడిట్‌ కార్డు, వ్యక్తిగత రుణాల పరిమితుల్లో కోతను విధిస్తున్నాయి. 

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. ఈ ప్రభావం తమపై పడుతుందని భావించిన పలు బ్యాంకులు ఈ చర్యలకు పూనుకోగా, ఖాతాదారులు, వ్యాపారులకు శరాఘాతంగా పరిణమిస్తున్నాయి. 

తమ బ్యాంకు శాఖల్లోని దాదాపు 2 లక్షల కస్టమర్ల క్రెడిట్‌ కార్డు పరిమితిని 30 శాతం నుంచి 90 శాతం వరకు తగ్గిస్తున్నట్టు యాక్సిస్‌ బ్యాంక్‌ తన అంతర్గత ఉత్తర్వుల్లో పేర్కొంది. దేశంలోని క్రెడిట్‌ కార్డుల్లో 12.6 శాతం ఈ బ్యాంకుకు చెందినవే. గతంలో తన క్రెడిట్‌ పరిమితి రూ.5 లక్షలుగా ఉండేదని, ఇప్పుడు దాన్ని రూ. 50వేలకే పరిమితం చేశారని  ఓవినియోగదారుడు వాపోయారు. 

కొటక్‌ మహీంద్రా బ్యాంకులో కూడా క్రెడిట్‌ కార్డు పరిమితులకు కత్తెర్లు పడుతున్నాయి. గతంలో తన క్రెడిట్‌ పరిమితి రూ. 75 వేలు ఉండగా.. ప్రస్తుతం దాన్ని రూ 44 వేలకు తగ్గించారని ఆ బ్యాంకు వినియోగదారుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఓవర్‌డ్రాఫ్ట్‌ ప్రాతిపదికన పలు బ్యాంకులు చిన్న వర్తకులు, రిటైలర్లకు ఇచ్చే రుణాల పరిమితులను కూడా తగ్గిస్తున్నాయి. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ తరహా రుణాల్ని కిరాణా, మెడికల్‌, డెయిరీలకే పరిమితం చేయాలని హెడీఎఫ్‌సీ బ్యాంకు తన శాఖల మేనేజర్లను ఆదేశించింది. క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత రుణాల పరిమితిని కూడా తగ్గించింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం ఫిబ్రవరి నాటికి దేశంలోని క్రెడిట్‌ కార్డుల మొత్తం విలువ రూ. 1.1 లక్షల కోట్లకు చేరుకున్నది. ఇది చారిత్రాత్మక గరిష్ఠ స్థాయి. గతేడాదితో పోలిస్తే ఇది 26 శాతం ఎక్కువ. జనవరినాటికి దేశంలో 5.6 కోట్ల యాక్టివ్‌ క్రెడిట్‌ కార్డులున్నాయి.