కేంద్ర బృందాలను అడ్డుకున్న బెంగాల్ ప్రభుత్వం

క‌రోనా వైర‌స్ ను కట్టడి చేయడం కోసం ఉమ్మడిగా పోరాటానికి సిద్ధం కావలసిన పశ్సీమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ తమ వైఫల్యాలను కప్పులుచ్చుకోవడం కోసం కేంద్రంపై రాజకీయ పోరాటానికి కాలుదువ్వుతున్నారు. ప‌రిస్థితిని అంచ‌నా వేసేందుకు బెంగాల్‌కు వెళ్లిన కేంద్ర బృందాల‌కు ఆమె ప్రభుత్వం అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. 

ఈ బృందాలకు అక్క‌డ ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌డం లేద‌ని కేంద్ర‌హోంశాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి స‌లిలా శ్రీవాత్స‌వ్ తెలిపారు. క్షేత్ర స్థాయి ప‌రిస్థితిని అంచ‌నా వేసేందుకు వెళ్లిన కేంద్ర బృందాలకు అక్కడి ప్రభుత్వం అవ‌కాశం ఇవ్వ‌డంలేద‌ని ఆమె పేర్కొన్నారు. 

కోల్‌క‌తాతో పాటు జ‌ల్‌పాయిగుడికి కేంద్ర బృందాలు వెళ్లాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర హోంశాక కార్య‌ద‌ర్శి అజ‌య్ భ‌ల్లా .. బెంగాల్ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. అంతర్ మంత్రివర్గ బృందాల‌కు రెండు ప్రాంతాల్లో అనుమ‌తి ఇవ్వ‌డంలేద‌ని మంత్రిత్వ‌శాఖ‌కు తెలిసిందని, వారికి స‌హ‌కరించాల‌ని అజ‌య్ బెంగాల్ సీఎస్‌ను కోరారు. 

ఈ నేప‌థ్యంలో ఇవాళ సాయంత్రం అయిదు గంట‌ల ప్రాంతాల్లో కేంద్ర బృందాల‌ను కోల్‌క‌తాలో ప‌ర్య‌టించేందుకు అనుమ‌తించారు. రాష్ట్ర పోలీసులు, బీఎస్ఎఫ్ భ‌ద్ర‌త మ‌ధ్య కేంద్ర బృందాలు కోల్‌క‌తాలో ప‌రిస్థితిని ప్ర‌త్య‌క్షంగా స‌మీక్షిస్తున్నాయి.  

అంత‌క‌ముందు క‌రోనా వైర‌స్‌పై పోరాటంలో అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కోల్‌క‌తా ప్ర‌జ‌ల‌ను  కోరారు.  ఇవాళ ఆమె కోల్‌క‌తా వీధుల్లో తిరిగారు. రాజాబ‌జార్‌లో ఆమె త‌న కాన్వాయ్‌లోని కారులో నుంచే ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. 

పౌరులంతా ఇండ్ల‌ల్లోనే ఉండాలంటూ ఆమె ఆదేశించారు. క‌రోనా నుంచి ప్రాణాల‌ను కాపాడుకుని, దేశాన్ని కూడా ర‌క్షించుకోవాల‌ని పేర్కొన్నారు.