17.8 శాతం కరోనా నుండి కోలుకున్నారు 

భారత్ లో కరోనా కేసుల సంఖ్యా పెరుగుతున్నా, వైద్య చికిత్స అనంతరం కోలుకొంటున్న వారి సంఖ్యా కూడా క్రమంగా పెరుగుతున్నది. మొత్తం మీద 17.8 శాతం మంది కోలుకున్నారని  కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. 

భారత్‌లో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1329 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 44 మంది మృతిచెందారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,985కు పెరిగిందని తెలిపింది. 

ప్రస్తుతం దేశంలో 15122 కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా..3260 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.  కరోనా బారినపడి మంగళవారం సాయంత్రం వరకు 603 మంది ప్రాణాలు కోల్పోయారు.

కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆసుపత్రుల్లో ఇతర వైద్య సేవలు కూడా అందుబాటులో ఉండాలని, హెచ్‌ఐవీ, క్యాన్సర్ వ్యాధులకు కూడా చికిత్స అందాలని.. అయితే అదే సందర్భంలో ఇన్‌ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. 

61 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా ఈ జిల్లాల జాబితాలో లాతూర్, ఉస్మానాబాద్, హింగోలి, వాసిమ్ జిల్లాలు చేరినట్లు తెలిపింది. కరోనా వ్యాక్సిన్ కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ఐసీఎమ్‌ఆర్ స్పష్టతనిచ్చింది. 

కరోనాను నయం చేసే దిశగా 5 వ్యాక్సిన్స్‌లను 70 మందిపై ప్రయోగించినట్లు తెలిపింది. ఇప్పటివరకూ భారత్‌లో 4,49,810 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎమ్‌ఆర్ వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 35,852 కరోనా టెస్టులు చేసినట్లు పేర్కొంది.

ఇలా ఉండగా, రాపిడ్ టెస్టింగ్ కిట్ లను ఉపయోగించడం రెండు రోజులపాటు నిలిపివేయమని రాష్ట్రాలకు   ఐసీఎమ్‌ఆర్ సూచించింది. సరైన ఫలితాలు ఇవ్వడం లేదని రాజస్థాన్ ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ఈ విషయమై తమకు పరిశీలించి రెండు రోజులలో ఏమి చేయాలో చెబుతామని తెలిపింది. 

ఈ విషయమై రాజస్థాన్ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ పరిశీలన ప్రకారం కేవలం 5.4 శాతం మాత్రమే సరైన ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్యమంత్రి రఘుశర్మ వెల్లడించారు. కనీసం 90 శాతం ఖచ్చితమైన ఫలితాలు రావలసి ఉంది. 

రాజస్థాన్‌లో జైపూర్ సహా పలు హాట్‌స్పాట్లలో 170 ఫరీక్షలు జరుపగా తప్పుడు ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈసరికే కరోనా ఉన్నవారికి సైతం ఆ కిట్లు ఉపయోగించి పరీక్షిస్తే నెగెటివ్ వచ్చిందని వివరించారు. ఈ మధ్యనే చైనా నుండి 5 లక్షల కిట్ లను భారత్ దిగుమతి చేసుకోవడం తెలిసిందే.