కరోనా పట్ల మమతా `నేరమయ నిర్లక్ష్యం'

కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం మొత్తం ప్రపంచం ఏకోన్ముఖంగా పోరాటం చేస్తుంటే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రాణాంతక వైరస్ పట్ల `నేరమయ నిర్లక్ష్యం' వహిస్తూ ఉండడం విస్మయం కలిగిస్తున్నది. వైరస్ తీవ్రతను తగ్గించు చూపడం కోసం ప్రభుత్వం నియమించిన బృందం ధృవీకరించే వరకు కరొనతో మృతిచెందిన వారి వివరాలు ప్రకటించవద్దని ఆంక్షలు విధించారు. 

అర్ధరాత్రి కరోనా మృతులను పోలీసులు, వైద్య సిబ్బంది కలసి ఎవ్వరి కంట పడకుండా పూడ్చి పెట్టిన వీడియోలు న్యూస్ ఛానల్స్ లో ప్రసారం కావడం ప్రభుత్వ వ్యవహార శైలిని వెల్లడి చేస్తుంది. జాతీయ స్థాయిలో కేంద్రం ప్రకటించిన హాట్ స్పాట్ ల జాబితాలో రాష్ట్రంలో కొలకత్తాతో పాటు మరికొన్ని జిల్లాలు ఉన్నప్పటికీ, వారి గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 

లాక్ డౌన్ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్రాలలో పర్యటిస్తున్న కేంద్ర బృందం కొలకత్తాకు చేరుకొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీబ్ సిన్హా కలసి వారి పర్యటన పట్ల రాష్ట్ర ప్రభుత్వ అసంతృప్తి వ్యక్తం చేశారు. తద్వారా ఈ విషయంలో కూడా కేంద్రంపై వివాదాలకు కాలుదువ్వడానికి మమతా సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతుంది. 

పైగా కేంద్రం సహకరించడం లేదని అంటూ ఆమె అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఉదాహరణకు అవసరమైన టెస్ట్ కిట్ లను సరఫరా చేయడం లేదని అంటూ మొత్తం కలకత్తాకు 24 కిట్ లే ఉన్నాయని ఆమె ఈ మధ్య ఆరోపణ చేశారు. అయితే రాష్ట్రంలో కరోనా పరీక్షలకు ప్రధాన కేంద్రమైన మలేరియా, అంటువ్యాధుల జాతీయ సంస్థ డైరెక్టర్ డా. శాంత దత్త ఈ ఆరోపణలను తీవ్రంగా తోసిపుచ్చారు. 

మొత్తం తూర్పు ప్రాంతానికి సరిపడిన 27,000 కిట్లు సిద్ధంగా ఉన్నాయని ఆమె చెప్పారు. అయితే వాటిని రాష్ట్ర ప్రభుత్వమే ఉపయోగించుకోవడం లేదని కూడా తెలిపారు.

ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని వదలని పక్షంలో కొలకత్తాతో పాటు మిడ్నపూర్, ఉత్తర - దక్షిణ 24 పరాగణాలు, ముర్షిదాబాద్, మాల్డా, దీనజపూర్ జిల్లాలలో కరోనా భీకరంగా వ్యాపించే అవకాశం ఉన్నట్లు వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

ఒక కధనం ప్రకారం పశ్చిమ బెంగాల్ లో 10 లక్షల మందిలో 33.7 మందికి మాత్రమే కరోనా పరీక్షలు జరుపుతున్నారు. జాతీయ సగటు 156.9 గా ఉంది. రాజస్థాన్ లో అయితే 442 మందికి పరీక్షలు జరుపుతున్నారు. 

ఇలా ఉండగా, ఈ మధ్య ఈడెన్ హాస్పిటల్ లో జరిగిన దిగ్బ్రాంతి కలిగించే సంఘటనను వైద్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడి చేస్తున్నారు. ఉత్తర కొలకత్తా లోని వైద్య కళాశాలలో గల ఈ హాస్పిటల్ లో చేరిన ఒక గర్భిణీ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. 

ఆమెకు లేబర్ గదిలో శస్త్రచికిత్స చేశారు. అక్కడ ఆమెను సుమారు  50 మంది నర్సులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది కలిశారు. లేబర్ గది క్రిక్కిరిసి ఉంది. ఒకొక్క మంచంపై ముగ్గురు రోగులు ఉన్నారు. అక్కడ ఆమెను కలసిన మరి అనేక మందికి కూడా వైరస్ సోకి ఉండవచ్చని డాక్టర్లు అనుమానిస్తున్నారు. 

ఈ సంఘటన గురించి తెలియగానే  రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మొదట ఆమెను కలిసిన 50 మంది సిబ్బందిని ఐసొలేషన్ కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత కాదు 25 మందిని పంపిస్తున్నామన్నారు. చివరికి అందరిని విధులలో చేర్చుకొని, మొత్తం సంఘటనని కప్పిపుచ్చారు. 

ఇటువంటి సంఘటనలు నేడు ఈ రాష్ట్రంలో అనేకం జరుగుతున్నాయి. వైరస్ గురించిన వాస్తవాలను కప్పిపుచ్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి ప్రమాదంనైనా పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలను సేకరించడం పట్ల కూడా ప్రభుత్వం శ్రద్ద వహించడం లేదు.