దేశంలో  తొలి కరోనా విముక్తి రాష్ట్రం గోవా 

ప్రపంచం అంతా కరోనా మహమ్మారితో కకావికలమవుతున్న సమయంలో భారత దేశంలో కరోనా నుండి తాము విముక్తి పొందామని మొదటిసారిగా గోవా ప్రభుత్వం ప్రకటించడం ఆసక్తి కలిగిస్తున్నది. గోవా అంటేనే విదేశీ పర్యాటికులు ఎక్కువగా వచ్చే రాష్ట్రం.  

కానీ అక్కడ ఈ వైరస్ వ్యాప్తి తక్కువగా ఉండడం, సత్వరం ప్రభుత్వం కట్టడి చేయడంతో అందరి దృష్టిని ఆకట్టుకొంది. ఏప్రిల్‌ 3 నుంచి రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని, వైరస్‌బారిన పడ్డ ఏడుగురు కోలుకున్నారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజిత్‌ రాణే ప్రకటించారు. 

దీంతో దేశంలోనే తొలి కరోనా విముక్త రాష్ట్రంగా గోవా నిలిచిందని వెల్లడించారు.  గోవా బీచ్‌లలో సేదతీరడానికి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్దఎత్తున వస్తారు. కరోనా కేసులు అధికంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక నుంచి గోవాకు ఎనిమిది వరకు రోడ్డు మార్గాలు ఉన్నాయి. ఈలెక్కన గోవాకు కరోనా ముప్పు అధికమే. 

దీంతో మార్చి 24న రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తూ ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రలతో రాకపోకల్ని నిషేధించారు. మరుసటి రోజే మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. విదేశాలకు ప్రయాణించిన వారేనని తెలుసుకున్న అధికారులు ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఆదేశాలు జారీ చేశారు. 

రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సరైన సదుపాయాలు లేవు. దీంతో ‘గోవా మెడికల్‌ కాలేజీ’లోని మెడిసన్‌ విభాగం అధిపతి, ఈఎస్‌ఐ దవాఖాన వైద్యుడు ఎడ్విన్‌ గోమ్స్‌ను అధికారులు సంప్రదించారు. 

వైరస్‌ సోకిన ఏడుగురికి ఆయన సూచనలమేరకు 200 మంది వైద్య నిపుణులు చికిత్స అందించి కోలుకునేలా చేశారు. ‘రోగికి వైరస్‌పై ఉన్న భయాల్ని గోమ్స్‌ ముందుగా తొలిగిస్తారు. మానసికంగా దృఢంగా ఉండేందుకు రోగిని సిద్ధంచేసిన తర్వాతనే చికిత్సను ప్రారంభిస్తారు’ అని రాష్ట్రంలో వైరస్‌ బారినపడిన మొదటి వ్యక్తి తెలిపారు.