వైరస్ సోకిన నాలుగు రెట్లమంది బైటే

భారత దేశంలో సంక్రమించిన కరోనా వైరస్ సోకిన వారిలో ఆ లక్షణాలు అసలు కనిపించక పోవడంతో పాజిటివ్ వచ్చిన వారు ఆసుపత్రులలో ఎంతమంది ఉన్నారో, అంతకు నాలుగు రేట్ల మంది బైట తెలియకుండానే యధేచ్చగా ఉంటూ, ఈ వైరస్ ను మరనేకమందికి వ్యాపింప చేస్తున్నట్లు శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. 

పరీక్షలు నిర్వహించిన కరోనా రోగులలో నూటికి 20 మందిలో మాత్రమే వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. మిగిలిన 80మందిలో ఎటువంటి లక్షణాలు బయటపడటం లేదు. దానితో కరోనా సోకిన వారు సహితం తాము ఆరోగ్యంగానే ఉన్నామన్న భావనతో బైట తిరుగుతూ, ఇతరులకు సంక్రమింప చేయడం ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది. దానితోనే లాక్ డౌన్ ప్రకటించి నెలరోజులు అవుతున్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంటున్నది. 

దేశంలో ఇప్పటికి సుమారు 18,000 మంది కరోనాబారిన పడగా, అంతకు నాలుగురెట్లు అంటే సుమారు లక్ష మంది జనారణ్యంలో తిరుగుతూ తమకు తెలియకుండానే వైరస్‌ను విస్తరిస్తున్నారు. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కి చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రమన్‌ గంగాఖేడ్కర్‌ వెల్లడించారు. 

వ్యాధి లక్షణాలతో తమ వద్దకు వచ్చినవారికి, వారిని కలిసిన వారికి మాత్రమే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి, చికిత్సలు అందిస్తూ, క్వారంటైన్‌కు పంపుతున్నది. కానీ వ్యాధి లక్షణాలు లేకుండానే వైరస్‌ను మోసుకొని తిరుగుతున్నవారు భారీ సంఖ్యలో ఉంటారని, వీరిని గుర్తించడం సవాలుతో కూడుకున్నదని డాక్టర్‌ గంగాఖేడ్కర్‌ హెచ్చరించారు. 

ఈ ప్రక్రియ మరిన్ని రోజులు కొనసాగటం ఎంతో ప్రమాదకరమని, వీరివల్ల రోగుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నదని హెచ్చరించారు. నిజానికి వైరస్‌లోనే ఆ వైవిధ్యమున్నదని చెబుతూ రోగనిరోధకశక్తి బలహీనంగా ఉన్నవారిలో మాత్రమే దగ్గు, జ్వరం, జలుబు వంటి వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయని ఐసీఎంఆర్‌ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నిర్మల్‌కుమార్‌ గంగూలీ చెప్పారు.   

వైరస్‌ బాధితులను గుర్తించేందుకు మరింత మెరుగైన విధానాన్ని అనుసరించాలని రమన్‌ సూచించారు.  అయితే లక్షణాలు కనిపించని వారిని గుర్తించడానికి కొత్త విధానమేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. వైరస్‌ కేసులు నమోదైన ప్రాంతాలు, హాట్‌స్పాట్లలో ఇన్‌ఫ్లూయెంజా తరహా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.