కరోనా మృతులను కప్పిపుస్తున్న తెలంగాణ

కరోనా లక్షణాలతో ఎవరైనా చనిపోతే, వారి మృతదేహానికి పరీక్షలు చేసి, వారు కరోనాతో చనిపోయిన్నట్లు నిర్ధారణ చేయడం దేశ వ్యాప్తంగా జరుగుతున్నది. అయితే ఆ విధంగా చనిపోయిన మృతదేహాలకు ఇక కరోనా పరీక్షలు జరుపవద్దని తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేయడం వివాదాస్పదంగా మారుతున్నది. 

తెలంగాణలో ఇప్పటి వరకు చనిపోయిన 21 మందిలో, దాదాపు సంగంగా 10 మంది చనిపోయిన తర్వాత జరిగిన పరీక్షలలోనే కరొనతో చనిపోయిన్నట్లు నిర్ధారించారు. ఇప్పుడు ఇటువంటి ఉత్తరువులు ఎందుకు జారీచేయవలసి వచ్చింది అధికారులు వివరణ ఇవ్వలేక పోతున్నారు. 

రాష్ట్ర ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు జారీచేసిన ఆదేశం ప్రకారం మృతదేహాల నుండి కరోనా పరీక్షల కోసం నమూనాలు సేకరించడాన్ని నిషేధించారు. కరోనా లక్షణాలతో చనిపోయిన్నట్లు భావించమంటూనే, అటువంటి మరణాలను కరోనా మరణాల సంఖ్యతో వెంటనే కలపవద్దని కూడా స్పష్టం చేశారు. 

ఆ వ్యక్తి కుటుంభం సభ్యులు, సన్నిహితులను క్వారంటైన్‌‌‌‌చేసి టెస్టులు చేయాలని నిర్ణయించారు.  వారిలో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే మాత్రమే ఆ మరణాన్ని కరోనా మృతుల జాబితాలో కలపాలని సూచించారు. 

హైదరాబాద్ పాతబస్తీలో ఓ మహిళ మరణించాక చేసిన టెస్టుల్లో కరోనా ఉన్నట్టు తేలింది. ఆమె కుటుంబ సభ్యుల్లో ఏకంగా 13 మందికి వైరస్ పాజిటివ్‌ వచ్చింది. ఇలాంటి పరిస్థితులలో ఇటువంటి ఆదేశాలు ఎందుకు ఇచ్చారో ప్రభుత్వం పెదవి విప్పకపోవడం గమనార్హం.