అమెరికాలోకి వలసలు నిలిపివేత 

అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తుండడంతో  అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్‌ ప్రకటించారు.

అదృశ్య శత్రువు దాడి నుంచి తప్పించుకునేందుకు, అదే విధంగా అమెరికా పౌరుల ఉద్యోగాలను కాపాడుకునేందుకు అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేస్తున్నట్లు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. 

అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 7 లక్షల 92 వేలు దాటింది. అమెరికాలో ఇప్పటి వరకు కరోనాతో 42,514 మంది మృతి చెందారు. అమెరికాలో నిన్న ఒక్కరోజే 1939 మంది ప్రాణాలు కోల్పోయారు.  

కాగా,  కరోనా గుట్టు విప్పేందుకు తమ దర్యాప్తు బృందాన్ని వుహాన్‌కు పంపాలనుకుంటున్నామని ట్రంప్ ప్రకటించారు. ‘అక్కడకు వెళ్లడంపై చాలా కాలం కిందటే చైనాను కోరాం. మేం అక్కడి వెళ్లాలనుకుంటున్నాం. అక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలనుకుంటున్నాం. కానీ చైనా మమ్మల్ని అనుమతించడంలేదు’ అని తెలిపారు.  

అయితే, వుహాన్‌లోకి తమ దర్యాప్తు బృందాన్ని అనుమతించాలన్న అమెరికా డిమాండ్‌ను చైనా నిర్దందంగా తోసిపుచ్చింది. కరోనాకు సంబంధించి తాము కూడా బాధితులమేనని, దోషులం కాదని స్పష్టంచేసింది. ఈ వైరస్‌ మానవాళికి ఉమ్మడి శత్రువని  చైనా విదేశాంగ మంత్రి జెంగ్‌ షువాంగ్‌ స్పష్టం చేశారు. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అమెరికాలో ఇబ్బంది పడుతున్న భారతీయ విద్యార్థులను ఆదుకొనేందుకు పలు హిందూ సంస్థలు ముందుకొచ్చాయి. ఇమిగ్రేషన్‌తో పాటు ఇతర సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు వీలుగా 802-750-యువ (9882) నంబర్‌తో హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాయి.  

మరోవంక, అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో సోమవారం నుంచి వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి. తద్వారా అమెరికాలో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. మరోవైపు కరోనా మరణాలతో అల్లాడిన న్యూయార్క్‌లో క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతున్నదని అధికారులు ప్రకటించారు.