నాలుగు మహానగరాల్లో కరోనా ఉధృతి 

దేశంలోని నాలుగు మహానగరాలలో కరోనా ఉదృతి ఆందోళనకరంగా ఉంది.  మహారాష్ట్ర రాజధాని ముంబై, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, రాజస్తాన్ రాజధాని జైపూర్ నగరాల్లో కేసులు అధిక సంఖ్యలో కొనసాగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

 భారత్‌లో గడచిన 24 గంటల్లో 1553 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. భారత్‌లో 24 గంటల్లో 36 మంది కరోనా బారిన పడి మరణించినట్లు ఆయన తెలిపారు. తాజా.. పాజిటివ్ కేసులతో కలిపి భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,265కు చేరింది. 

భారత్‌లోని 59 జిల్లాల్లో గత 14 రోజులుగా ఎలాంటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ తెలిపింది.. పుదుచ్చేరిలోని మహే జిల్లాలో, కర్ణాటకలోని కొడగు జిల్లాలో, ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలో గత 28 రోజులుగా ఒక్క కరోనా పాజిటివ్ కూడా నమోదు కాలేదని ఆరోగ్య శాఖ వెల్లడించడం కాస్త ఊరట కలిగించే విషయం.

కరోనా మహమ్మారి ధాటికి అతలాకుతలం అవుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎక్కువ సంఖ్యలో జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడినట్లు  తేలింది. 167 మంది జర్నలిస్టుల నమూనాలు సేకరించి కరోనా టెస్టులు నిర్వహించగా 53 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

53 మందిలో పలు వార్తా సంస్థలకు చెందిన రిపోర్టర్లు, ఫొటోజర్నలిస్టులు, కెమెరామెన్‌లు కూడా ఉన్నారు. ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించకపోయినప్పటికీ పరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. మరోవైపు చెన్నైలోనూ ముగ్గురు జర్నలిస్టులకు కరోనా సోకింది. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. 

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంగించడం కేసులు పెరగడానికి ఒక కారణమని  కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో అల్లర్లు కూడా జరిగాయని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నివేదికలు తీసుకుంటున్నామని, అల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. 

కేంద్రం తీసుకున్న అతిపెద్ద చర్యల్లో ప్రస్తుత లాక్‌డౌన్ ఒకటని, ప్రజల ఆరోగ్యాన్ని నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిబద్దతతో పని చేస్తోందని చెప్పుకొచ్చారు.