కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 17 సూత్రాలు 

క‌రోనా కేసులు త‌క్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో నేటి (ఏప్రిల్ 20) నుంచి లాక్ డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర ప్ర‌భుత్వ ఆఫీసులు, కొన్ని ర‌కాల ప‌రిశ్ర‌మ‌లు, కంపెనీలు ప‌రిమిత సంఖ్య‌లో ఉద్యోగులతో పనులు ప్రారంభించేందుకు అవ‌కాశం ఇచ్చింది. ఉద్యోగులు, కంపెనీలు పాటించాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై 

ఏప్రిల్ 15న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా వెలువ‌రించింది. అయితే ఎట్టిప‌రిస్థితుల్లోనూ హాట్ స్పాట్స్, కంటైన్మెంట్ జోన్ల‌లో ఎటువంటి కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌డానికి లేదని, మే 3 వ‌ర‌కు మ‌రింత క‌ఠినంగా లాక్ డౌన్ అమ‌లు చేయాల‌ని కేంద్రం ఆదేశించింది. నాన్ హాట్ స్పాట్స్ లో ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని ఆఫీసులు తిరిగి ప్రారంభం  అయ్యాయి. 

డిప్యూటీ సెక్రెట‌రీ, అంత‌క‌న్నా పై స్థాయి అధికారుల 100 శాతం హాజరు కావాల‌ని కేంద్రం సూచించింది. మిగ‌తా స్టాఫ్ 33 శాతం అటెండ్ అవ్వాల‌ని చెప్పింది. ఈ నేప‌థ్యంలో ఉద్యోగులు, అధికారులు పాటించాల్సిన ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల గురించి 17 పాయింట్ల‌తో కూడిన గైడ్ లైన్స్ జారీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ‌.

1. త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ లేదా క‌ర్చీఫ్ క‌ట్టుకుని డ్యూటీకి రావాలి.

2. ఆఫీసుల‌తో పాటు ఉద్యోగులు త‌ర‌చూగా తాకే వ‌స్తువుల‌ను శానిటైజ్ చేయాలి.

3. ద‌గ్గేట‌ప్పుడు, త‌మ్మేట‌ప్పుడు క‌ర్చీఫ్ లేదా టిష్యూతో క‌వ‌ర్ చేసుకోవాలి.

4. వ్య‌క్తిగ‌త శుభ్ర‌త, ఫిజిక‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి.

5. ఆఫీసులు బిల్డింగ్, రూమ్స్ ను క‌చ్చితంగా డిసిన్ఫెక్ట్ చేయించాలి.

6. రోజులో ప‌దే ప‌దే స‌బ్బుతో లేదా ఆల్క‌హాల్ శానిటైజ‌ర్ల‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి.

7. ఆఫీసులో ఉద్యోగుల సీటింగ్ కూడా దూరంగా ఉండేలా చూసుకోవాలి.

8. క్యాంటీన్ల‌లో ఉద్యోగులు, అధికారులు ఒక చోట గుంపుగా చేర‌కూడ‌దు.

9. ఆఫీసులో ఐదుగురికి మించి ఒక చోట చేర‌కుండా చూసుకోవాలి.

10. ఆఫీసుల‌కు విజ‌ట‌ర్స్ ఎవ‌రూ రాకూడ‌దు. ఎవ‌రైనా త‌ప్ప‌నిస‌రిగా ఆఫీసులో అధికారుల‌ను క‌ల‌వ‌డానికి వ‌స్తే వారిని స్క్రీనింగ్ చేసిన త‌ర్వాత‌నే లోప‌లికి అనుమ‌తించాలి.

11. సమావేశాలు కూడా నేరుగా పెట్టుకోకుండా వీడియో కాన్ఫ‌రెన్స్ ల ద్వారానే నిర్వ‌హించుకోవాలి.

12. ఇత‌ర ఆఫీసుల‌కు, వేరే సెక్ష‌న్ల‌కు పంపాల్సిన ఫైల్స్ వీలైనంత వ‌ర‌కు ఈమెయిల్స్ ద్వారానే పంప‌డానికి ప్రాధాన్య‌మివ్వాలి.

13. పోస్ట‌ల్, ఇత‌ర మార్గాల ద్వారా ఆఫీసుకు ఎటువంటి పత్రాలు వ‌చ్చినా.. వాటి డెలివ‌రీకి వ‌చ్చిన వారిని ఆఫీసుల గేటు దాటి లోప‌లికి రాకుండా చూసుకోవాలి.

14. అధికారులు, ఉద్యోగులు వారి ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలి. ఎవ‌రికైనా జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం, ఊపిరి తీసుకోవ‌డంలో ఇబ్బంది వంటి స‌మ‌స్య‌లు ఉంటే పై అధికారుల‌కు తెలియ‌జేసి వెంటనే ఆఫీసు నుంచి వెళ్లిపోయి.. వైద్య స‌హాయం తీసుకోవాలి.

15. ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు హోమ్ క్వారంటైన్ లో ఉండి ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌ను పాటించాలి.

16. హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సి వ‌చ్చిన ఉద్యోగుల‌కు వెంట‌నే అధికారులు లీవ్ శాంక్ష‌న్ చేయాలి.

17. ఉద్యోగుల్లో వృద్ధులు, గ‌ర్భ‌ణులు, దీర్ఘ‌కాల వ్యాధులు ఉన్న వారు ఉంటే హైరిస్క్ ఉద్యోగులుగా గుర్తించి.. మ‌రింత జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. వీరు నేరుగా పబ్లిక్ తో కాంటాక్ట్ అయ్యే ప‌నులు చేయ‌కుండా చూసుకోవాల‌ని చెప్పింది.