నన్ను కొనే దమ్ముందా విజయసాయి!

తాను చంద్రబాబు నాయుడుకు రూ 20 కోట్లకు అమ్ముడుబోయిన్నట్లు వైసిపి నేత విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తనను కొనే దమ్ము ఈ భూమి మీద ఎవడికి లేదని స్పష్టం చేశారు. 

"నీకు దమ్ముంటే.. మగాడివైతే కాణిపాకంలో ప్రమాణం చేస్తావా?" అంటూ సవాల్ చేశారు. విజయసాయిరెడ్డి అధికారమదం తలకెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. 

తనపై విమర్శలంటే ఆకాశంపై ఉమ్మేసినట్లేనని కన్నా చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పారదర్శకత నిరూపించుకోవాలంటే మీకెందుకు పొడుచుకొచ్చిందని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి ఇష్టానుసారం మాట్లాడితే పరువునష్టం దావా వేస్తానని కన్నా హెచ్చరించారు. 

విజయసాయిరెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు చెప్పారు.  "మీరు ప్రజాధనాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా?. నిజాయితీ నిరూపించుకోమని అడగడం దుష్ప్రచారం ఎలా అవుతుంది? అని విజయసాయిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

కరోనా టెస్టింగ్‌ కిట్లపై అధికారులు ఒక్కొక్కరు ఒక్కో ధర చెబుతున్నారు. హైదరాబాద్‌లోని శాండర్‌ ఏజెన్సీకి ఒక్కో కిట్‌కు రూ.730 పర్చేజ్ ఆర్డర్‌ ఇచ్చారు. ఒక్కో కిట్‌ రూ.640 అని జవహర్‌ రెడ్డి చెబుతున్నారు. విశాఖ మెడ్‌టెక్‌లో రూ.1200కే కరోనా టెస్టింగ్‌ కిట్‌ అని సాక్షిలో రాశారు" అని గుర్తు చేశారు. 

 కిట్ల ధర విషయంలో గందరగోళం ఉందనే పారదర్శకత నిరూపించుకోవాలని తాను రాష్ట్ర ప్రభుత్వానికి హితవు చెప్పానని కన్నా పేర్కొన్నాను. రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెబుతూ కరోనాపై ప్రభుత్వం చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలని ధ్వజమెత్తారు. 

ఎన్నికలు పెట్టాలన్న ఆత్రం తప్ప ప్రజల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి  పట్టింపు లేదని కన్నా మండిపడ్డారు. పైగా, బీజేపీ కార్యకర్తలను వైసీపీ ఇబ్బంది పెడుతోందని విమర్శించారు.