కేరళ లాక్‌డౌన్‌  సడలింపుపై కేంద్రం సీరియస్ 

తమ ఆదేశాలను బేతఖార్ చేస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ను సడలించడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది.  కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ ను సడలిస్తూ కేరళ  ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్లు, బుక్‌ షాపులు తెరవడం, కొన్ని పట్టణాల మధ్య బస్సు సర్వీసులు నడపడం, కార్లలో వెనుక సీట్లలో ఇద్దరితో ప్రయాణానికి అనుమతినివ్వడం వంటి సడలింపులను తప్పుబట్టింది. తక్షణమే వీటిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని స్పష్టం చేసింది. 

సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కేంద్రం రూపొందించిన గైడ్‌లైన్స్‌ను అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు.  ఏప్రిల్‌ 15,2020న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను కేరళ ప్రభుత్వం ఉల్లంఘించిందని అందులో స్పష్టం చేశారు. 

విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం జారీ చేసిన నిబంధనలను పాటించకుండా కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా వివిధ కార్యకలాపాల నిర్వహణకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని పినరయి విజయన్‌ ప్రభుత్వ తీరును కేంద్రం ఎండగట్టింది. 

అయితే కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించామని కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ సమర్ధించుకున్నారు. అపార్థాలు చోటుచేసుకున్నందు వల్లే కేంద్రం వివరణ కోరిందని చెప్పారు. తాము వివరణ ఇచ్చిన తర్వాత సమస్య సమసిపోగలదనే ఆశాభావం వ్యక్తం చేసారు.