ఇల్లే ఆఫీసు.. ఇంటర్నెట్ సమావేశ గది

ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు ఒక ఆఫీసుగా, ఇంటర్నెట్ సమావేశ గదిగా మారిపోయాయని, వృత్తి జీవితాన్ని కరోనా వైరస్ పూర్తిగా మార్చి వేసిందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ఇక మీదట ఆఫీసు సహచరులతో విరామ సమయం గడపడం అనేది చరిత్రగా ఉండిపోనుందని పేర్కొన్నారు. 

‘ప్రస్తుతం చోటు చేసుకున్న మార్పులను నేను కూడా అలవాటు చేసుకుంటున్నాను. చాలావరకు మంత్రివర్గ సహచరులతో సమావేశాలు, అధికారులు, ప్రపంచ నాయకులతో సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్‌లద్వారానే జరుగుతున్నాయి’ అని ప్రధాని ‘లింక్డ్ ఇన్’ అనే ఓ సులభతరంగా సామాజిక మాధ్యమంలో తెలిపారు.

మొత్తం మన పనితీరే మారిపోయిందని చెబుతూ మన సినిమా తారలు కూడా ఇళ్లలోనే ఉంటూ సృజనాత్మక వీడియోలు రూపొందించి పంపుతున్నారని చెప్పారు. మన గాయకులు ఆన్‌లైన్‌లో కచేరీలు చేస్తున్నారని, చదరంగ క్రీడాకారులు ఆన్‌లైన్‌లో ఆడుతున్నారని వివరించారు. 

ఈ రకంగా కరోనాకు వ్యతిరేకంగా పోరులో వినూత్నమైన పద్ధతుల్లో పాలుపంచుకుంటున్నారని, మొత్తం మన పనే డిజిటల్‌గా మారిందని ప్రధాని గుర్తు చేశారు. అంతేకాకుండా  అనుసరించగల వ్యాపార, జీవన శైలి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారు.

‘ప్రాణనష్టం జరగకుండా, సంక్షోభ సమయంలో కూడా మనం పని చేయగలిగితే మన ఆఫీస్, వ్యాపారాలు,ఆర్థిక కార్యకలాపాలు ఎంతో వేగంగా ముందుకు సాగుతాయి' అని సూచించారు. 

ఈ రోజు ప్రపంచం కొత్త వ్యారా మార్గాల కోసం వెతుకుతోంది. ఎక్కువ మంది యువత కలిగి, వినూత్న ఆలోచనలకు పేరుగాంచిన భారత్ వాటిని ప్రపంచానికి అందివ్వడంలో ముందడుగు వేయగలదని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. 

అంతర్జాతీయంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత భౌతిక, వాస్తవిక సమ్మేళనంలో భారత్ అంతర్జాతీయ ఉత్పత్తులకు కేంద్రంగా మారగలదన్న ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. భారత దేశం భౌతికంగా, ఆన్‌లైన్‌ సామర్థ్యాలను సరిగా మేళవించడం ద్వారా ద్వారా కరోనా అనంతర ప్రపంచంలో సంక్లిష్టమైన ఆధునిక బహుళ జాతీయ సరఫరాలకు అంతర్జాతీయ కూడలిగా అవతరించగలదని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు. 

సాంకేతికత అధికారుల ఆధిపత్యాన్ని తగ్గించి, దళారీ వ్యవస్థను రూపుమాపి సంక్షేమ ఫలాల అమలును వేగవంతం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌.. జాతి, మతం, కులం, రంగు, తెగ, భాష, సరిహద్దులకు అతీతమైనదని, అది ప్రతి ఒక్కరినీ సమానంగా ప్రభావితం చేస్తుందని నరేంద్రమోదీ చెప్పారు. 

ఇక నుంచీ అంతా ఐక్యమత్యంతో పనిచేద్దామని సూచించారు. గత చరిత్రలో దేశాలు, సమాజాలు ఒకరితో మరొకటి సంఘర్షించాయని, కానీ, నేడు అంతా కలిసి సవాళ్లను ఎదుర్కొంటున్నామని గుర్తు చేశారు. 

ఇక భవిష్యత్తు అంతా ఐక్యంగా ఉండడం, దృఢంగా సవాళ్లను ఎదుర్కోవడంపైనే ఆధారపడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. భారతదేశం నుంచి భవిష్యత్తులో వచ్చే బృహత్తర ఆలోచనలకు అంతర్జాతీయంగా ప్రాధాన్యం, ఉపయోగం ఉండేలా చూడాలని మోదీ సూచించారు. 

గతంలో రహదారులు, గోదాములు, రేవులు వంటి భౌతిక మౌలిక సదుపాయాల దృష్ట్యా మన అవసరాల గురించి ఆలోచించామని, ఇప్పుడు మన ఇళ్లలోంచే అంతర్జాతీయ సరఫరాలను నియంత్రించగలమని పేర్కొన్నారు.