చైనా కంపెనీల తరలింపుపై యోగి కన్ను!

అమెరికా - చైనాల మధ్య వాణిజ్య పోరు ప్రారంభమైనప్పటి నుండి చైనాలో గల తమ కంపెనీలను ఇతర ప్రదేశాలకు  తరలించడం కోసం పలు దేశాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. 

ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా చైనా వాస్తవాలను చెప్పకుండా తమకు అపారమైన ప్రమాదం వాటిల్లింప చేసిందనే ఆగ్రహంతో ఉన్న అమెరికా, ఐరోపా దేశాలతో పాటు పలు దేశాలు ఆ దేశంలో గల తమ పరిశ్రమల తరలింపుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. 

అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇప్పటికే తమ ప్రణాళికలను వెల్లడిస్తున్నాయి. జపాన్ ప్రధాని షినో అబే అయితే చైనా నుండి తరలించే జపాన్ కంపెనీలకు 993 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని ప్రకటించారు. అమెరికా కూడా చైనా నుండి వచ్చే తమ కంపెనీలకు ప్రోత్సాహకాలు ప్రకటింపనున్నది. 

అందుకనే పలు చిన్న చిన్న దేశాలు - వియత్నాం, టైవాన్, బాంగ్లాదేశ్, థాయిలాండ్, ఫిలిపీన్స్ వంటివి ఆయా కంపెనీలను తమ దేశంలోకి వచ్చేటట్లు చేయడం కోసం సన్నాహాలు చేస్తున్నాయి. అయితే పెద్ద మార్కెట్ తో పాటు, నైపుణ్యం గల పనివారు, అపారమైన మౌలిక సదుపాయాలు గల భారత్ మాత్రం ఈ విషయంలో చెప్పుకోదగినంత ముందడుగు వేయలేక పోతున్నది. 

ఈ విషయమై మన దేశంలో బహుశా కరోనా సందర్భంగా మొదటగా దృష్టి సారించింది ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఒక వంక కరోనా మహమ్మారిపై సమర్ధవంతంగా పోరాటం జరుపుతూనే, విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడానికి దీనినొక్క పెద్ద అవకాశంగా భావిస్తున్నారు. 

అందుకనే చైనా నుండే వచ్చే కంపెనీలను ఆకట్టుకోవడానికి ఆకర్షణీయమైన ప్రణాలికను తయారు చేయమని ప్రభుత్వం అధికారులను ఆదేశించారు. దశాబ్దాల తరబడి పారిశ్రామికీకరణలో ఉత్తర ప్రదేశ్ వెనుకబడి ఉండడం తెలిసిందే. ఈ అవకాశంతో రాష్ట్రంలో పరిశ్రమల స్థానకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 

యుపిలో మాఫియా - నేరస్థులు - రాజకీయ నాయకత్వం ఉమ్మడి ప్రాబల్యం కారణంగా ఎవ్వరు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుండి, గత మూడేళ్ళుగా ఈ విషయమై దృష్టి సారించారు. 

ముందుగా పెట్టుబడులను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున విద్యుత్, రహదారులు, విమాన సదుపాయాలు వంటి  మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం పట్ల దృష్టి సారించారు.  రాష్ట్రాన్ని 1 బిలియన్ డాలర్ల ఆర్హ్దిక వ్యవస్థగా చేస్తానని చెప్పిన ఆయన నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల సదస్సులకు అనూహ్య స్పందన లభిస్తున్నది.

 ఇప్పటికి రక్షణ పరిశ్రమలకు రూ 70,000 కోట్ల ప్రతిపాదనలు ఆకర్షించడంతో పాటు రూ 4.68 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. సుపరిపాలన, గతంలో ఎన్నడూ లేని విధంగా శాంతి, భద్రతలు నెలకొనడంతో ఇప్పుడు పెట్టుబడిదారులు యుపి వైపు చూస్తున్నారు. 

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కూడా అసాధారణ పాలనా సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆదిత్యనాథ్ ఇప్పుడు చైనా నుండి తరలుతున్న పరిశ్రమలను ఆకట్టుకోవడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు.