అన్నవరంలో క్వారంటైన్ కేంద్రంపై కన్నా ఆగ్రహం 

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం కొండపై క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై  ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికు లేఖ రాశారు. ఎక్కడా స్థలం లేనట్టు కొండపై ఏర్పాట్లు చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని ఆయన ధ్వజమెత్తారు.  

ఏపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. 

హిందూ దేవాలయాలను, సత్రాలను క్వారంటైన్‌ కేంద్రాలుగా మారుస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎక్కడా అవకాశం లేనట్లు అన్నవరం కొండ ప్రాంతాన్ని ఎంచుకోవడం  పట్ల విషయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇవన్నీ చేస్తుందనడంలో సందేహం లేదని కన్నా స్పష్టం చేశారు. 

ప్రజా అవసరాల పేరుతో ఇలాంటి చర్యలు చేపట్టి హిందువులను అవమానిస్తున్నారని ఆ లేఖలో  కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ఆలయాలకు చెందిన సత్రాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయకుండా జిల్లాల కలెక్టర్లను ఆదేశించాలని ఆ లేఖలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కన్నా కోరారు.

అన్నవరం కొండ ఎంత పవిత్రమైందో అందరికీ తెలిసిందేనని, అక్కడ కల్పించిన వసతులన్నీ హిందువుల కోసం చేసినవేనని గుర్తుచేశారు. ఈ కొండపై నిర్మించిన సత్రాలన్నీ దాతలు, భక్తుల సహకారంతో చేపట్టినవేనని చెప్పారు. రాష్ట్రంలో సామాజిక అసమానతలు, మత కలహాలను సృష్టించే ప్రమాదం ఉందని కన్నా ఆందోళన వ్యక్తం చేశారు.