కరోనా మృతులలో 40 శాతం మహారాష్ట్ర నుంచే 

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఆదివారం ఒక్కరోజే 552 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 4,200 దాటింది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది 25 శాతం కంటే ఎక్కువే. ఢిల్లీలో కేసుల సంఖ్య రెండువేలు దాటింది.  

దేశవ్యాప్తంగా 24 గంటల్లో 1,712 కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు నమోదై న కేసుల్లో ఇది రికార్డు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 17,029కి, మరణాల సంఖ్య 565కు పెరిగిందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. 

ఇందులో మహారాష్ట్రలోనే 223 మంది మరణించారు. దేశంలోని మరణాల్లో మహారాష్ట్ర వాటానే 40 శాతానికిపైగా ఉన్నది. దేశంలో కరోనా మరణాల శాతం 3.5గా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ సంయు క్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 

కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య  పెరుగుతున్నదని, ఇప్పటివరకు 2,621 మం ది వైరస్‌ నుంచి కోలుకున్నారని ఆయన పేర్కొన్నా రు.  దేశంలోని 54 జిల్లాల పరిధిలో గత 14 రోజుల్లో ఒక్క కేసు కూడా రికార్డు కాలేదని చెప్పారు.

కరోనా నివారణకు వ్యాక్సిన్లు, ఔషధాల టెస్టింగ్‌ కోసం వైద్య శాస్త్ర సంబంధ రంగాల ప్రతినిధులతో ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ ఆదివారం ఏర్పాటైందని తెలిపారు. 

దేశంలో నమోదైన కేసుల్లో 46.39% (6,540) కేసులు 10 జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ముంబైలో 2,079, ఇండోర్‌లో 842, న్యూ ఢిల్లీ 802, అహ్మదాబాద్‌ 590, పుణె 496, జైపూర్‌ 489, హైదరాబాద్‌ 407, దక్షిణ ఢిల్లీ 320, థానె 293, చెన్నై 222 కేసులు నమోదయ్యాయి.