అమరావతి భూముల భాగోవతమే లక్ష్యంగా ఐటి దాడులు !

పన్ను ఎగవేత చేసారని అనుమానిస్తున్న వారిపై ఆదాయపన్ను శాఖ అధికారులు జరుపుతున్న దాడులు తెలుగు దేశం ప్రభుత్వంలోని పెద్దలలో వణుకు పుట్టిస్తున్నాయి.  వీటిని రాజకీయ దాడులుగా పేర్కొనడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసారు. పైగా దాడులకు వచ్చే అధికారులకు పోలీస్ రక్షణ ఇవ్వకూడదని కూడా నిర్ణయానికి వస్తున్నారు. అందుకోసమని న్యాయశాఖ అభిప్రాయం కుడా సేకరించారు అట.

సాధారణ వ్యాపార సంస్థలపై దాడులు జరుగుతూ ఉంటే ప్రభుత్వంలోని పెద్దలు ఇంతగా కలవరం చెందనవసరం లేదు. అమరావతి రాజధాని పేరుతో రైతులను నమ్మించి కారుచవకగా 33 వేల ఎకరాల భూములను సేకరించిన ప్రభుత్వం కనీసం వారికి ఇచ్చిన హామీల మేరకు తగు ప్రయోజనాలు కలిగించడం లేదు. అయితే ఈ భూములను ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు కారుచావుకగా ధారాదత్తం చేస్తున్నారు. మరోవంక ఎక్కడెక్కడ భూములను సేకరిస్తున్నారో ముందుగానే ప్రణాళిక వేసుకొని ఆ చుట్టుప్రక్కల సన్నిహితులతో వందలాది ఎకరాల భూములను ముందుగానే కొనిపించారు. తద్వారా వేల కోట్ల రూపాయల నల్లదనం సమకూరినట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ లావాదేవీలపై ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించిన తర్వాతనే ఈ దాడులు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. పలువురు రాజకీయ నాయకులు ఆ విధంగా సమకూర్చుకున్న `నల్లధనాన్ని’ పలు కంపనీలలో పెట్టుబడులుగా పెట్టారు. ఈ దాడుల ద్వారా అటువంటి పెట్టుబడుల గుట్టు రట్టు చేసే ప్రయత్నం చేస్తూ ఉండడంతో పెద్దల అందరిలో వణుకు పుడుతున్నది.

రాష్ట్రంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్, ఆక్వా, గ్రానైట్‌ వ్యాపారులపై ఆదాయపన్ను శాఖా  (ఐటీ) అధికారులు ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. అధికారులు బృందాలుగా విడిపోయి విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. చేస్తున్న వ్యాపారం కంటే తక్కువ పన్ను చెల్లిస్తున్న వారితోపాటు అనుమానిత రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలే లక్ష్యంగా ఈ దాడులు ప్రారంభించినట్లు సమాచారం. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్న సదరన్, శుభగృహ సంస్థలతోపాటు వీఎస్‌ గ్రూపు కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుపుతున్నారు.

రాష్ట్ర ఐటీ అధికారులతో సంబంధం లేకుండా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ల నుంచి వచ్చిన సుమారు 200 మంది అధికారులు 19 బృందాలుగా మారి ఈ దాడులు చేస్తున్నట్లు తెలిసింది.  ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్న వారితో పాటు రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న వారు సైతం పలువురు ఈ విధంగా  భారీ ఎత్తున రాజధాని ప్రాంతంలో భూములను కొనుగోలు చేశారు.  ఇందులో బినామీల లెక్కకు అంతే లేదు. అందుచేత వారి ఆదాయాలు, వారు కొనుగోలు చేసిన భూముల మధ్య గల వ్యత్యాసాల అంతు తేల్చడం కోసం ఇప్పుడు నడుం బిగించిన్నట్లు తెలుస్తున్నది.

అందుకనే ఇప్పుడు ప్రారంభమైన ఈ ఇటి దాడులు ఇప్పటిలో ఆగిపోయే అవకాశాలు లేవని, పలు దఫాలుగా కొనసాగ వచ్చని తెలుస్తున్నది. భూముల లావాదేవీలలో సంబంధం ఉన్నవారిని గుర్తించి, వారి ఆర్ధిక వనరులపై క్షుణంగా పరిశీలన జరుపుతున్నట్లు చెబుతున్నారు. రాజధాని పేరు చెప్పి నిలువు దోపిడీ చేసిన పెద్దలందరి భాగోవతాన్ని రట్టు చేసే ప్రయత్నంలో ఉన్నట్లు చెబుతున్నారు.

సదరన్‌ డెవలపర్స్‌ కార్యాలయంలో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ డాక్యుమెంట్లు ఓ మంత్రికి చెందినవిగా గుర్తించారు. సదరన్‌ డెవలపర్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో అమరావతిలో భూ లావాదేవీలు జరిపినట్లు ఐటీ శాఖ గుర్తించింది. చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ మంత్రి బంధువు ఈ కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ఆస్తులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. జరుగుమిల్లి మండలం కె.బిట్రగుంట వద్ద ఎమ్మెల్యేకు చెందిన సదరన్‌ ఇన్‌ఫ్రా ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్‌పై ఐటీ అధికారులు శుక్రవారం ఉదయం 6 గంటలకే దాడులు ప్రారంభించారు.  రెండు వాహనాల్లో వచ్చిన 10 మంది అధికారులు ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టారు. కీలక పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.  ఎమ్మెల్యేకు సంబంధించి టంగుటూరు మండలం కారుమంచి వద్ద, ఉలవపాడు మండలం రామాయపట్నం వద్ద అనధికారికంగా ఏర్పాటు చేసిన రొయ్యలు వలిచే ఫ్యాక్టరీల వివరాలు ఐటీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి.

రాజధాని పేరుతో స్వాహా చేసిన వేల కోట్ల రూపాయలను ఎక్కడ, ఏవిధంగా, కనిపించకుండా పెట్టుబడులుగా పెట్టారో అని తేల్చే పనిలో ఉన్నారు. ఈ భూముల కుంభకోణంలో కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు, వారికి కాపు కాచిన కాంట్రాక్టర్లు, వ్యాపార వేత్తలు ఉన్నారు. వారందరి సంబంధాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉండడంతో సహజంగానే చంద్రబాబు ప్రభుత్వంలో వణుకు ప్రారంభమైనది.