తెలంగాణలో 7 వరకూ లాక్‌డౌన్‌ పొడి

ఏప్రిల్ 20 తర్వాత సడలింపుకు కేంద్రం అవకాశం ఇచ్చినా తెలంగాణలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సడలింపులు ఉండవని, మే 7 వరకూ లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు   ప్రకటించారు. 

ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆదివారం ఆరుగంటలసేపు మంత్రివర్గ సమావేశం జరిపిన తర్వాత తెలిపారు.  జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మే 5న మరోసారి పరిస్థితిని సమీక్షించి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

'గతంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ నిబంధనలు అలాగే కొనసాగుతాయి. ఈనెల 20 తర్వాత కూడా రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు ఉండవు'అని స్పష్టం చేశారు. అయితే కరోనా కేసుల విషయంలో మే 1 తర్వాత రాష్ట్రంలో ఊరట కలిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర పరిస్థితులను బట్టి సడలింపుల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం కూడా చెప్పిందని గుర్తు చేశారు. 

గతంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ నిబంధనలు అలాగే కొనసాగుతాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన దేశాలు కూడా మళ్లీ పాటిస్తున్నాయని చెబుతూ 45 దేశాలు ప్రస్తుతం పూర్తి  లాక్‌డౌన్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.  కంటైన్మెంట్‌ జోన్లలో ఇంకా కఠినంగా వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 

లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావడంతో చాలామంది ఇంటి అద్దె  కట్టలేని పరిస్థితి నెలకొందని అంటూ ఇంటి యజమానులు.. కిరాయిదారుల నుంచి మార్చి, ఏప్రిల్‌, మే నెలల అద్దె వసూలు చేయొద్దని కేసీఆర్ ఆదేశించారు. తర్వాత నెలల్లో వాయిదాల వారీగా వసూలు చేసుకోవాలని సూచించారు. 

ఇది విజ్ఞప్తి కాదని, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారమని స్పష్టం చేశారు. ఎవరైనా ఇబ్బంది పెడితే 100కి ఫోన్‌ చేసి చెప్పాలని సూచించారు. సతాయిస్తే ఇంటి యజమానులపై కఠిన చర్యలుంటాయని చెబుతూ అద్దె వాయిదా వేశామంటూ వడ్డీ వసూలు చేయాలని చూస్తే ఊరుకోమని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. 

పండగలు, ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఎలాంటి మతపరమైన సామూహిక కార్యక్రమాలకు అనుమతి లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో సేవలకు తెలంగాణలో అనుమతి లేదని  కేసీఆర్‌ స్పష్టం చేశారు. సోమవారం  నుంచి మే 7 వరకు అన్ని ఫుడ్‌డెలివరీ సంస్థలకు అనుమతి ఉండదని పేర్కొన్నారు.  

మే నెలలో కూడా ప్రతి తెల్ల రేషన్‌ కార్డుదారుడికి 12 కిలోల బియ్యం, కుటుంబానికి రూ.1500 చొప్పున నగదు సాయం అందిస్తామని తెలిపారు  గ‌చ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ .. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్ స్ అండ్ రీసెర్చ్ (టిమ్స్) గా మార‌బోతుంద‌ని కేసీఆర్ ప్రకటించారు. 

అలాగే రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెబుతూ తక్కువ ధరకు అమ్ముకుని రైతులు నష్టపోకూడదని కోరారు.