లక్ష మరణాలతో ఐరోపాలో మరణ మృదంగం 

కరోనా వైరస్ భూతం యూరప్ దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. గత కొన్నివారాలుగా ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశాలు మరణగీతం ఆలపిస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో మరణాలతో ఈ యూరప్ దేశాల పరిస్థితి దయనీయంగా మారింది. 

ప్రస్తుతం ఐరోపా వ్యాప్తంగా 11,53,148 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, మరణాల సంఖ్య భీతిగొలిపే రీతిలో  1,01,398 కు  పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,61,196 మంది మరణించగా, వారిలో మూడొంతుల మంది ఐరోపావారే కావడం గమనార్హం. 

ఇటలీ 23,227 మరణాలతో యూరప్ లో ప్రథమస్థానంలో ఉంది.  స్పెయిన్‌లో 20,639 మంది, ఫ్రాన్స్‌లో 19,323 మంది, బ్రిటన్‌లో 15,464 మంది   కరోనాతో మృత్యువాత పడ్డారు. 

ఇక ప్రపంచం మొత్తమ్మీద కరోనా కేసుల విషయానికొస్తే ఇప్పటివరకు 23,34,130 పాజిటివ్ కేసులను గుర్తించారు. మరణాల సంఖ్య  1,61,196 మందికి    చేరింది. అన్ని దేశాల కంటే అత్యధికంగా అమెరికాలో 39,090 మంది చనిపోయారు. అమెరికాలో 7,35,287 మంది కొవిడ్-19 బారినపడ్డారు.

అమెరికాలో వారంరోజుల్లోనే రెండు లక్షల మందికి కొత్తగా వైరస్‌ సోకిం ది. రోజుకు సగటున 28 వేల కొత్త కేసులు నమోదవుతున్నట్టు స్పష్టమవుతున్నది. వారంలో 18,437 మంది మృత్యువాతప డ్డారు. అంటేరోజుకు సగటున 2,633, గంటకు 110 మంది మరణిస్తున్నారు. 

రష్యాలో చాపకింద నీరులా వైరస్‌ వ్యాపిస్తున్నది. వారం రోజులుగా సగటున మూడు వేల కేసులు నమోదుకాగా, గత 24 గంటల్లోనే అత్యధికంగా 6,060 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తున్నది. మొత్తం కేసుల సంఖ్య 42,853కు, మరణాల సంఖ్య 361కు  చేరింది.  మరోవైపు, 193కు పైగా దేశాలకు కరోనా విస్తరించింది.