కరొన వ్యాప్తిపై దర్యాప్తు కోరిన ఆస్ట్రేలియా 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి బాధ్యులెవరన్న దానిపై స్వతంత్ర విచారణ జరపాలని ఆస్ట్రేలియా డిమాండ్ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పాత్రపైన దర్యాప్తు చేయాల్సిందేనని  స్పష్టం చేసింది. 

కరోనా తొలి కేసులు నమోదైనప్పుడే చైనా ప్రపంచ దేశాలను అలర్ట్ చేసిందా లేదా అన్న దానిపై నిజనిజాలు తెలియాల్సి ఉందని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్ పేన్ తేల్చి చెప్పారు.

”వైరస్ పుట్టుక తో పాటు దాన్ని ఎదుర్కొనేందుకు అనుసరించిన వ్యుహాలు, సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకున్న వివరాలు తెలియాలి. ఇది స్వతంత్ర విచారణ ద్వారానే సాధ్యమవుతుంది” అని ఆమె పేర్కొన్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోనూ చర్చించామని ఆమె చెప్పారు. 

చైనాలోని వుహాన్‌ నగరంలో తొలుత వైరస్‌ వెలుగులోకి వచ్చినప్పుడు ఆ దేశం వ్యవహరించిన తీరు, వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకున్న తీరుపై దర్యాప్తు జరిగితే అసలు విషయాలు బయటికి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. 

ఇప్పటికే చైనా, డబ్ల్యూహెచ్ఓ పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే డిమాండ్ చేశారు. దీంతో చైనా, డబ్ల్యూహెచ్ఓ లపై ఒత్తిడి మొదలైంది. అటు కరోనా చైనాలో వైరస్ విజృంభిస్తోన్న సమయంలోనే ఆ దేశం నుంచి విమానాలపై నిషేధం విధించామని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ తెలిపారు. 

తమ నిర్ణయాన్ని పున సమీక్షించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ కోరినప్పటికీ పట్టించుకోలేదని అదే ఇప్పుడు ఆస్ట్రేలియాను కరోనా బారి నుంచి కాపాడిందని ఆయన గుర్తు చేశారు.