ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థలకు కేంద్రం చెక్‌   

లాక్‌డౌన్‌ నుంచి అత్యవసరం కాని వస్తువుల విక్రయాలకు వెసులుబాటు లభించిందనుకున్న ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం కళ్లెం వేసింది. పప్పుదినుసులు తదితర ఆహారోత్పత్తులు, ఔషధాలు, వైద్య పరికరాలు వంటి అత్యవసరాల సేవలు మినహా మిగతా వాటిని ఆపేయాలని అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ మొదలగు ఆన్‌లైన్‌ సంస్థలను కేంద్ర ప్రభుత్వం  ఆదేశించింది. 

ఈ నెల 20 నుంచి మొబైల్‌ ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌ కంప్యూటర్లు, వాషింగ్‌ మెషీన్లు, రెడిమేడ్‌ దుస్తులు తదితర నాన్‌-ఎసెన్షియల్‌ సేల్స్‌ను కూడా ఈ-కామర్స్‌ సంస్థలు జరుపవచ్చని 15వ తేదీన కేంద్రం అనుమతి ఇచ్చింది.

దీంతో ఆన్‌లైన్‌ సంస్థలన్నీ కస్టమర్ల నుంచి ఆర్డర్లు కూడా తీసేసుకున్నాయి. ఈ క్రమంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆదివారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ప్రకటించారు. ఈ-కామర్స్‌ సంస్థలు వినియోగించే వాహనాలు.. అవసరమైన అనుమతులతో మాత్రమే నడుస్తాయని తాజా ఆదేశంలో ఆయన పేర్కొన్నారు.

వైరస్‌ ఉధృతి క్రమేణా పెరిగిపోతున్నదని, పరిస్థితులపై రోజువారీ సమీక్షలు జరుపాల్సి వస్తున్నదని హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ ఈ సందర్భంగా  తెలిపారు. కరోనా తీవ్రతతో నిర్ణయాలను మార్చుకోవాల్సి వస్తున్నదని చెప్పారు. అందుకే ఈ-కామర్స్‌ నాన్‌-ఎసెన్షియల్‌ సేల్స్‌ లాక్‌డౌన్‌కు విఘాతమని భావించి గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని పేర్కొన్నారు. 

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాల ఈ నిర్ణయాన్ని అఖిలభారత వర్తకుల సంఘం స్వాగతించింది. దేశీయ వర్తకుల మనోభావాలకు విలువనిచ్చారని, సంప్రదాయ వ్యాపారుల ప్రయోజనాలను రక్షించారని కొనియాడారు.