తెలంగాణలో గత రెండు రోజులుగా ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురుస్తునందున,వేల ఎకరాల్లో పంట తీవ్రంగా నష్టం జరిగి, ధాన్యం తడవకుండా, కాపాడడం కోసం వెళ్లిన రైతులు పిడుగుపాటుకు గురై మరణించడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎం.పి బండి సంజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వరి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయలు, మామిడి , పండిస్తున్న రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందు అకాల వర్షాలకు దెబ్బతినడంతో పాటు పిడుగులు పడి అనేకమంది రైతులు మృత్యువాత పడ్డారని, అనేకమంది గాయాల పాలయ్యారని తెలిపారు.
ఈ ప్రకృతి విపత్తులపై ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. లాక్ డౌన్ లో ప్రభుత్వం రైతులకు కావాల్సిన సదుపాయాలను అందించాలని రెండు సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళానని గుర్తుచేశారు, సీఎస్ సోమేశ్ కుమార్ తో ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడి రైతుల సమస్యలను పూర్తిగా వివరించినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి, నల్గొండ జిల్లాలో మరణించిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రైతులు కరోనా వైరస్ కోసం ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ పాటిస్తూనే పంటలు పండిస్తున్నారని వారిని ఆదుకోవాల్సిన ధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు.
రబీలో అత్యధికంగా పంట వచ్చిందని సీఎం కేసీఆర్ ప్రకటనలు చేసి గొప్పలు చెప్పారని, కానీ పండిన పంటను సకాలంలో కోతకోసి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయలేకపోయారని సంజయ్ దుయ్యబట్టారు. ఈ పంట నష్టానికి, రైతుల మరణాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణం అని దుయ్యబట్టారు.
చాలా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఈ అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రాష్ట్రంలో రైతుల కష్టాలను ప్రభుత్వం వెంటనే తీర్చి ఆదుకోవాలని, వర్షాలకు నేలకొరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేసి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ప్రారంభించి మద్దతు ధర అందించాలని సంజయ్ డిమాండ్ చేశారు.
ఐకెపి సెంటర్లలో ఉన్న ధాన్యాన్ని వర్షాల నుండి కాపాడుకునేలా తాటిపత్రి పరదలను, బార్ ధన్ బస్తాలను రైతులకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎల్లవేళలా బీజేపీ అండగా ఉంటుందని, పంట నష్టం అందించే వరకు బీజేపీ శ్రేణులు తోడుగా ఉంటారని సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు.