రోజురోజుకీ పరిస్థితి మెరుగుపడుతోంది 

దేశంలో రోజురోజుకీ పరిస్థితి మెరుగుపడుతోందని  కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ భరోసా ఇచ్చారు.    భారత్‌లో కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు పడుతోన్న సమయం పెరిగిందని చెప్పారు.

గడచిన 14 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు 6.2 రోజులు పట్టేదని, గడచిన వారంలో దీనికి 7.2 రోజుల సమయం పట్టిందని పేర్కొన్నారు. గడచిన మూడు రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు 9.7 రోజులు పడుతోందని చెప్పారు. ఇది ముమ్మాటికీ  శుభసంకేతమని స్పష్టం చేశారు.

ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించిన హర్షవర్ధన్ కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితిని గమనించారు. అడ్మిట్ అయిన 177లో 95 మంది రోగులు నేడు డిశ్చార్జ్ అవుతున్నారని చెప్పారు.  

గడచిన 24 గంటల్లో 1,334 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్  వెల్లడించారు. 24 గంటల్లో కరోనా వల్ల దేశవ్యాప్తంగా 27 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన తెలిపారు. దీంతో.. కరోనా వల్ల భారత్‌లో మరణించిన వారి సంఖ్య 507కు చేరింది. దేశవ్యాప్తంగా 2,231 మంది కరోనా నుంచి ఇప్పటివరకూ కోలుకున్నట్లు లవ్ అగర్వాల్ తెలిపారు.  

భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,712కు చేరింది. గత 14 రోజులుగా దేశంలోని 43 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని లవ్ అగర్వాల్ వెల్లడించారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,000 కరోనా టెస్ట్‌లు చేసినట్లు ఐసీఎమ్ఆర్ తెలిపింది. ఇప్పటివరకూ 3.86 లక్షల మందికి దేశవ్యాప్తంగా కరోనా టెస్టులు చేసినట్లు స్పష్టం చేసింది.