వ‌ల‌స కూలీలు ఎవ‌రూ రాష్ట్రాలు దాట‌వ‌ద్దు  

వ‌ల‌స కూలీలు ఎవ‌రూ రాష్ట్రాలు దాట‌వ‌ద్దు అని కేంద్ర కేంద్ర‌హోంశాఖ నేడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎక్క‌డ ఉన్న కూలీలు అక్క‌డి ప్ర‌భుత్వం వ‌ద్ద నమోదు చేసుకోవాలని సూచించింది. లాక్‌డౌన్ కాలం ముగిసే వ‌ర‌కు వ‌ల‌స కూలీలు రాష్ట్రాలు దాట‌వ‌ద్దు అని స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చింది. 

సహాయ శిబిరాలలో ఉన్న వారు స్థానిక అధికారుల వ‌ద్ద నమోదు  చేసుకోవాల‌ని హోంశాఖ తెలిపింది. ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉన్న‌వారు అక్క‌డే ఉండాల‌ని స్పష్టం చేస్తూ, ఏప్రిల్ 20 త‌ర్వాత కొన్ని రంగాల్లో పని చేసుకునేందుకు ప్ర‌భుత్వం వ‌ల‌స కూలీల‌కు అనుమ‌తి ఇచ్చింది.

లాక్‌డౌన్ సడలింపులిస్తున్న ప్రాంతాల్లో వలస కూలీల అంతర్రాష్ట్ర ప్రయాణానికి ఆయా రాష్ట్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర హోంశాఖ సూచించింది. లాక్‌డౌన్ కారణంగా వివిధ శిబిరాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు ఏ పని చేయగలుగుతారో స్థానిక అధికారులు తెలియజేయాలని  సూచించింది. అంతేతప్ప, ప్రస్తుతమున్న శిబిరాల నుంచి మాత్రం బయటికి మాత్రం ప్రయాణం చేయవద్దని హోంశాఖ స్పష్టం చేసింది. 

‘‘శిబిరాల్లో ఉన్న వలస కార్మికులు తాము ఏపని చేయగలుగుతారో స్థానిక అధికారులకు సమాచారమివ్వాలి. స్థానిక అధికారులు కూడా వారు ఏఏ రంగాల్లో తమ సేవలను అందించగలుగుతారో గుర్తించాలి’’ అని కేంద్ర హోంశాఖ సూచనలు చేసింది. 

దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని హాట్ స్పాట్ లేని కేంద్రాల్లో సోమవారం నుంచి కొన్ని ఆర్థిక కలాపాల కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే పనిచేస్తున్న సమయంలో సామాజిక దూరం, శానిటైజేషన్... ఇలా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని హోంశాఖ సూచించిన విషయంతెలిసిందే. 

పారిశ్రామిక, తయారు, నిర్మాణ, వ్య‌వ‌సాయం, మ‌న్రేగా లాంటి ప‌నులు వ‌ల‌స కూలీలు చేసుకోవ‌చ్చు అని హోంశాఖ పేర్కొన్న‌ది. ఏదైనా రాష్ట్రంలోని వారు మ‌రో న‌గ‌రంలో కూలీల‌కు ప‌ని దొరికే అవ‌కాశం ఉంటే, అప్పుడు వారు స్క్రీనింగ్ తర్వాత అక్క‌డికి వెళ్ల‌వ‌చ్చు అని తెలిపింది. 

ఎటువంటి వైర‌స్ ల‌క్ష‌ణాల‌ను లేని వారిని మాత్ర‌మే సహాయ శిబిరాల  నుంచి వ‌ర్కింగ్ ప్ర‌దేశాల‌కు త‌ర‌లించాల‌ని ప్ర‌భుత్వం త‌న ఆ దేశాల్లో పేర్కొన్న‌ది. ఈ-కామ‌ర్స్ ద్వారా కేవ‌లం అత్య‌వ‌స‌ర వ‌స్తువుల స‌ర‌ఫ‌రా కోసం అనుమ‌తి ఇచ్చారు.