ఐటీ దాడులపై ఉలిక్కి పడతారెందుకు బాబు

పన్ను ఎగవేత దారుల గుట్టు పట్టుకోవడం కోసం ఆదాయపన్ను శాఖ అధికారులు సాధారణంగా జరుపుతున్న సోదాల గురించి టిడిపి నేతలు ఉలిక్కి పడటం పట్ల బిజెపి నాయకులు అవహేళన చేసారు. ఐటీ దాడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు భుజాలు తడుముకుంటున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేసారు. ఐటీ దాడులకు దొంగలు భయపడాలి కానీ.. టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.

పన్నులు ఎగ్గొట్టిన రాష్ట్రాల్లో మొట్ట మొదటిది ఆంధ్రప్రదేశ్ అయితే, రెండోది తెలంగాణ అని జివిఎల్ ఆరోపించారు. పక్కా సమాచారంతోనే ఏపీలో ఐటీ శాఖ దాడులు చేస్తోందని చెప్పారు. ఇక అప్పుల్లో కూడా కుంభకోణాలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆయన ద్వజమెత్తారు. అధికారంలో ఉన్నాం కదా అని చంద్రబాబు తప్పించుకోలేరని హెచ్చరించారు.

రక్షణ కల్పించమని సుప్రీంకోర్టులో పిల్‌ వేసినా తప్పించుకునే మార్గం ఉండదని స్పష్టం చేసారు. కాంగ్రెస్‌కు చంద్రబాబు రూ. 500 కోట్లు నిధులు సమకుర్చుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని అంటూ ఇదంతా ప్రజల సొమ్ము కాదా? అని జీవీఎల్‌ ప్రశ్నించారు. పన్నులు ఎగ్గొట్టే వారిపైనే ఐటీ దాడులు జరుగుతున్నాయని, ఉద్యోగులు వారి బాధ్యత నెరవేరుస్తున్నారని కన్నా స్పష్టం చేసారు.

 ఇలా ఉండగా, ఎన్నికల సభల్లో కేసీఆర్ వాడుతున్న భాష సరైంది కాదని కన్నా హితవుపలికారు. ఎదుట వ్యక్తిని గౌరవించడం ప్రతీ ఒక్కరి సంస్కారమని స్పష్టం చేశారు. ఇది చంద్రబాబు కూడా నేర్చుకోవాలని సూచించారు. మోదీని టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు బాబు ఎందుకు స్పందించలేదని అడిగారు. మోదీపై చేసిన వ్యాఖ్యలకు టీడీపీ క్షమాపణ చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు.