క్వారంటైన్‌కు 200 మంది నిలోఫర్ సిబ్బంది 

దేశంలో మరెక్కడా జరగని విధంగా ఒకే ఆసుపత్రికి చెందిన, అక్కడ వరుసగా మూడు రోజులు పనిచేసిన సిబ్బంది అందరిని - మొత్తం 200 మందిని కోరంటైన్ కు పంపడం హైదరాబాద్ లో జరిగింది.

జ్వరంతో ఆసుపత్రిలో చేరిన 45 రోజుల వయస్సుగల బాలుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. 

హైదరాబాద్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. తెలంగాణలో తాజాగా నమోదవుతున్న కేసులలో మూడొంతులు నగరంలోనే ఉంటున్నాయి. 

ఇప్పటికే తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 800కు మించిపోగా, కొత్తగా నమోదవుతున్న కేసులలో మూడొంతుల వరకు హైదరాబాద్ నగరంలోనే నమోదవుతూ వస్తున్నాయి. 

ఈనెల 15, 16, 17 తేదీల్లో ఆసుపత్రిలో విధులు నిర్వహించిన ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ఫ్రొఫెసర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందరిని క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. 

నారాయణపేట్‌ జిల్లా అభంగాపూర్‌కు చెందిన మహిళ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించింది. డిశ్చార్జి అయ్యాక నలభై ఐదు రోజుల వయసున్న చిన్నారికి జ్వరంరావడంతో అతని తండ్రి స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువెళ్లారు. 

ఆ తర్వాత మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి చిన్నారిని తీసుకువెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆ బాలుడిని నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. 

అక్కడ చిన్నారి నుంచి సేకరించి శాంపిల్స్‌తో కరోనా పాజిటివ్‌ అని తేలడంతో సూపరింటెండెంట్‌ ఈ ఆదేశాలు జారీచేశారు. అలాగే చిన్నారి కుటుంబ సభ్యులు ఆరుగురిని కూడా క్వారంటైన్‌కు తరలించారు