కరొన వదిలి రాజకీయాలపై జగన్ దృష్టి 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా కట్టడిపై కాకుండా రాజకీయ కక్షసాధింపు చర్యలపై ద్రుష్టి సారిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ధ్వజమెత్తారు. కరోనా విజృంభిస్తున్న ఇలాంటి తరుణంలో రాగద్వేషాలు, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని హితవుచెప్పారు. 

కరోనా నివారణకై కేంద్ర మార్గదర్శకాలను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సుజనా హెచ్చరించారు. కరోనా సామాజిక వ్యాప్తి చెందింతే పరిస్థితి భయంకరంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి సమయంలో వైసీపీ రాజకీయాలు చేయడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. 

ఇటువంటి సమయంలో పాలనలో విఫలమైతే ప్రజలకు చాలా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. విశాఖకు మెడ్‌టెక్ జోన్‌ను తీసుకురావడం చాలా మంచి పరిణామం అని చెబుతూ ఇక్కడే కిట్లను తయారు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం కొరియా నుంచి టెస్ట్ కిట్లు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వాన్న ఆయన ప్రశ్నించారు. టెస్టు కిట్ల ద్వారా వచ్చిన లాభాలేంటో చెప్పాలని నిలదీశారు. 

జగన్ ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టకుండా కేవలం రాజకీయాలపై, విద్వేషాలపై దృష్టిపెట్టిందని విమర్శించారు. అనుకోకుండా కరోనామహమ్మారి వచ్చినా.. పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని సుజనా చౌదరి ఆరోపించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరితో సంప్రదించి, సలహాలు, సూచనలు తీసుకోవడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. కరోనా వైరస్‌తో ప్రపంచమంతా వణికిపోతుంటే..జగన్ ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించలేదని మండిపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం కరోనా వైరస్ నివారణ కోసం గట్టిగా కృషి చేస్తోందని ఆయన కొనియాడారు. 

ప్రస్తుతం కరోనాకు ముందు.. కరోనాకు తరువాత అనే పరిస్థితులు వచ్చాయని చెబుతూ వైసీపీకి మంచి మెజార్టీ ఉందని, మంచి పాలన అందించి ప్రజల మెప్పు పొందాలని సుజనా హితవుచెప్పారు. అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.