కేంద్రం హెచ్చరికలతో  రోహింగ్యాలకై వేట  

ఇప్పటి వరకు కరోనా వైరస్ వాహకులుగా భావిస్తున్న మర్కజ్ నుండి తిరిగి వచ్చిన వారిని వెంటాడటంకోసంనానా తంటాలు పడుతున్న హైదరాబాద్ పోలీసులకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలతో   రోహింగ్యాలను వేటాడటం మరోసమస్యగా మారింది. కరోనా కట్టడిలో భాగంగా ఇంతవరకు విదేశాల నుండి, మర్కజ్, దేవబంద్ ల నుండి తిరిగి వస్తున్నవారి కోసం శ్రమపడుతూ వచ్చారు. 

తబ్లిగి జమాత్, హరియాణ మేవాట్ లో జరిగిన మత ప్రచారాల్లో రోహింగ్యాలు పాల్గొన్నారనే కేంద్ర నిఘా వర్గాల సమాచారంతోతెలంగాణ  పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోహింగ్యాల క్యాంపుల్లో శనివారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు జరిపారు. 

చాంద్రాయాణ​గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబానగర్, బాలాపూర్ ఏరియాల్లో నివసిస్తున్న రోహింగ్యాల వివరాలు రికార్డ్ చేస్తున్నారు. బాలాపూర్ మండల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నర్సింగ్ రావుతోపాటు ఇన్ స్పెక్టర్ భాస్కర్ రోహింగ్యాల డేటా కలెక్ట్ చేశారు. ఇక్కడి 30 క్యాంపుల్లో ఒక్కోదాంట్లో 20 నుంచి 30 వరకు బంగ్లాదేశ్, బర్మా, మయన్మార్ నుంచి వలస వచ్చిన కుటుంబాలు ఉంటున్నాయి. 

ఆయా క్యాంపుల పెద్దలను పిలిపించి అక్కడ ఉంటున్న కుటుంబాల వివరాలను సేకరించారు. ఫిబ్రవరి, మార్చి 1వ తేదీ తరువాత ఢిల్లీ, హరియాణ, యూపీతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వారి వివరాలు ఆరా తీశారు. అక్కడున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుకుని, అనారోగ్యంతో బాధపడుతున్న వారి పేర్లను నమోదు చేసుశారు. 

దీంతో పాటు మర్కజ్ తబ్లిగి జమాత్ కి వెళ్ళిన వారి డేటాను కలెక్ట్ చేసే పనిలో పడ్డారు. హైదరాబాద్ క్యాంపు నుంచి వెళ్ళిన వారిలో 8 మంది, నల్లగొండ, జగిత్యాల క్యాంపుల నుంచి రోహింగ్యాలు మర్కజ్, మేవాట్ వెళ్ళినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వాళ్ళు ఇంకా తిరిగిరాకపోవడంతో ఎక్కడికి వెళ్ళారనే వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలకోసం మరోసారి తనిఖీ చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.